BIKKI NEWS : బ్రిటిష్ సామ్రాజ్యవాద, వారి ప్రధాన స్వదేశీ సంస్థాన మిత్రుడు హైదరాబాద్ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా 1946 నుండి 1951 వరకు జరిగిన మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరుకు అగ్నిని రగిల్చిన తొలి గ్రామం కడవెండి. నిజాం రాజు సేనాని విసునూరు దేశముఖ్ రాపాక రామచంద్రారెడ్డి ఆగడాలకు తొలి ప్రతిఘటనకి కడవెండి గ్రామం వేదిక అయ్యింది. ఈ పోరాటం ఉప్పెనలా మూడు వేల గ్రామాలకు వ్యాపించి హైదరాబాద్ నగరం మినహా మిగతా ప్రాంతాలను కమ్యూనిస్టు గెరిల్లాల వశం అయ్యింది.
నిజాం రాజు బలహీనమయ్యి హైదరాబాద్ రాజ్యం భారత్ లో విలీనం కావడానికి దోహదం చేసింది. ఇలాంటి చారిత్రక ఘట్టంలో కడవెండి ప్రజల పాత్ర చిరస్మరణీయం. సుమారు నలభై మంది వీరులు బలిదానం చేశారు. ఆంధ్ర మహాసభ కడవెండి గ్రామ నూనూగు మీసాల కార్యకర్త దొడ్డి కొమురయ్య లేవి ధాన్యపు సేకరణలో పేద రైతులను పీడించడానికి దొరల, రాజు అధికారుల ఆగడాలకు వ్యతిరేకంగా సాహసోపేతమైన ఊరేగింపులో తుపాకీ కాల్పులకు బలి అయ్యాడు. ఈ మరణం కడవెండి గ్రామ యువకులను మరింత కదిలించింది. నల్లా నరసింహులు నాయకత్వంలో దళాలు ఏర్పడి జనగామ ప్రాంతాన్ని దొరల ఆగడాల నుండి విముక్తి చేశారు. వీరి భార్య నల్లా వజ్రమ్మ నేతృత్వంలో తొలి మహిళా దళం ఏర్పడి ప్రజలకు అండగా నిలబడింది. కొండయ్య, లింగయ్య, కొండల్ రెడ్డి, దొడ్డి మల్లయ్య, బాలయ్య, దావీదు రెడ్డి, యాదగిరి, అస్నాల నర్సోజి దళ చర్యలతో భూస్వాముల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు.
పాలకుర్తి ఐలమ్మ భూ పోరాటానికి వెన్ను దన్నుగా నిలిచింది కడవెండి గ్రామ గెరిల్లాలే. కామారెడ్డి గూడెం బందగి నిజాం న్యాయస్థానములో సాధించిన అపూర్వ విజయం, మొదలగు సంఘటనలు తెలంగాణ ప్రజల జడత్వం ను వదిలించాయి. రావి నారాయణ రెడ్డి, భీంరెడ్డి దేవులపల్లి, చకిలం శ్రీనివాసరావు వంటి కమ్యూనిస్టు నేతలు కడవెండి అందించిన స్పూర్తితో సాయుధ పోరాటంను నడిపారు. ఈ పోరాటం తన అంతిమ విజయం దరికి చేరక పోయిన అనేక సామాజిక మార్పులకు నాంది పలికింది. 10 లక్షల ఎకరాల భూమి పంపకం, కుల వివక్షత తగ్గడం, వెట్టి చాకిరి నిషేధంతో పాటు స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న నైజాం రాజు ను లొంగదీసి భారతదేశంలో విలీనం కావడములో ఆ తర్వాత దేశములో సంభవించిన అనేక ప్రజా పోరాటాలకు నిత్య చైతన్య స్ఫూర్తిగా నిలిచింది. ఈ మార్పులకు తొలి వెయ్యి అడుగులు వేసిన కడవెండి గ్రామం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది.