BIKKI NEWS (JULY 21) : Telangana Job calendar 2024 filling Jobs list. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న ఉద్యోగ క్యాలెండర్‌లో పాఠశాల, కళాశాల విద్యా శాఖలో ఖాళీగా ఉన్న దాదాపు 6500 అధ్యాపకుల, టీచర్ పోస్టులు చేరనున్నాయి.
Telangana Job calendar 2024 filling Jobs list
పాఠశాల విద్యాశాఖ పరిధిలో 110, డిగ్రీ విద్యా శాఖ పరిధిలో సుమారు 600 డిగ్రీ లెక్చరర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని మోడల్ స్కూళ్లలో 707 టీచర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా.. వాటిపైనా కసరత్తు చేస్తున్నారు. అలాగే 5 వేలకుపైగా ప్రభుత్వ ఉపాధ్యాయుల ఖాళీలను కూడా భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవలే ప్రకటించినందున అవి కూడా చేర్చవచ్చని భావిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం ప్రకటించే ఉద్యోగ క్యాలెండర్‌లో అధిక సంఖ్యలో పోస్టులు విద్యాశాఖ నుంచే ఉంటాయని తెలుస్తోంది.
డైట్ లెక్చరర్ పోస్టులకు అనుమతి ఇచ్చినా
పాఠశాల విద్యాశాఖలో 134 ఖాళీల భర్తీకి 2022 నవంబరులో ఆర్థిక శాఖ అనుమతి ఇస్తూ జీఓ 165ను జారీ చేసింది. అందులో 110 అధ్యాపక, సీనియర్ అధ్యాపక పోస్టులున్నాయి. వాటిలో రాష్ట్రంలో 12 డైట్ కళాశాలల్లో 65 అధ్యాపక, మరో 23 సీనియర్ అధ్యాపక ఉద్యోగాలున్నాయి. వరంగల్, మహబూబ్‌నగర్, నాగార్జునసాగర్‌లోని మూడు ప్రభుత్వ బీఈడీ కళాశాలలు, హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్, ఎస్‌సీఈఆర్‌టీలో మరో 22 అధ్యాపక ఖాళీలు కలిపి మొత్తం 110 కొలువులను భర్తీ చేసేందుకు టీజీపీఎస్సీకి అనుమతి ఇచ్చినా నోటిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకుడిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ఈవీ నర్సింహారెడ్డి ఆ పోస్టుల భర్తీ విషయంపై కమిషన్ అధికారులతో మాట్లాడారు. వాటిని ఉద్యోగ క్యాలెండర్‌లో ప్రకటించి భర్తీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. డిప్యూటీ ఈఓ ఖాళీలు 24 ఉన్నందున వాటిని కూడా జాబ్ క్యాలెండర్‌లో చేర్చనున్నారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే వాటిని గ్రూపు-1లో చేర్చాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది.
డిగ్రీ లెక్చరర్ పోస్టులకు అనుమతి ఉన్నా
డిగ్రీ కళాశాలల్లో 544 ఖాళీల భర్తీకి 2022లో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో 491 అధ్యాపక, 29 ఫిజికల్ డైరెక్టర్లు, 24 లైబ్రేరియన్ల ఉద్యోగాలున్నాయి. వాటికి 2022 డిసెంబరు 31న టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆగిపోయింది. ఆర్థికశాఖ ఆదేశాలతో ఖాళీల వివరాలను పంపినట్లు కళాశాల విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
మోడల్ స్కూల్ ఖాళీలు
రాష్ట్రంలో 2012లో 194 మోడల్ స్కూళ్లను ప్రారంభించారు. వాటిల్లో 3,880 పోస్టులను మంజూరు చేయగా.. ఇప్పటికీ 1,047 ఖాళీగా ఉన్నాయి. వాటిలో ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాల్సిన టీచర్ల ఖాళీలు 707 ఉన్నాయి. మోడల్ స్కూళ్లకు 318 జీఓ వర్తించదని కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో నియామకాలకు అడ్డంకిగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు మాత్రం అలాంటి కేసే గురుకులాల విషయంలో ఉన్నా అక్కడ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేపట్టారని, ఇక్కడా అలాగే చేయవచ్చని అంటున్నారు. యూపీఏ హయాంలోనే మోడల్ పాఠశాలలను నెలకొల్పినందున కాంగ్రెస్ ప్రభుత్వం వాటి బలోపేతానికి భర్తీ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.