తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ – 475 ఆవిర్భావం

  • ప్రభుత్వ కళాశాల బలోపేతానికి వెన్నెముక నూతన అధ్యాపకులు

హైదరాబాద్ (జూలై -09) : ఈరోజు హైదరాబాదులోని యుటిఎఫ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల 475 అసోసియేషన్ రాష్ట్రస్థాయి సమావేశం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్. వి. శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగావిచ్చేసిన రైతుబంధు సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మీ రెగ్యులరైజేషన్ విషయంలో అనేక దృష్ట శక్తులు అడ్డుపడినప్పటికీ మన ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్తశుద్ధితో మీ రెగ్యులరైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారని ఉద్ఘాటించారు. కావునా కేసీఆర్ ప్రభుత్వమును కాపాడుకోవాల్సిన అవసరం మనందరికీ ఉందని తెలిపారు. ప్రభుత్వ కళాశాలలను కాపాడుకోవాల్సిన ప్రధాన బాధ్యత మీదేనని తెలిపారు.

ఈ సమావేశంకు విశిష్ట అతిధిగా విచ్చేసిన ప్రభుత్వ మాజీ చీప్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ… మీరందరూ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అయినా చాలీచాలని జీతాలతో అధ్యాపక వృత్తిపై నమ్మకంతో ఉండి పనిచేస్తూ ఉండటం వలన మీరు ఈరోజు రెగ్యులరైజ్ అయ్యారని.. మీ సర్వీసులు రెగ్యులరైజేషన్ కోసం కొప్పిశెట్టి సురేష్ చేసిన పోరాటం చాలా గొప్పదని కొనియాడారు.

మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ అందే సత్యం మాట్లాడుతూ నేను మీ సంఘం సలహాదారుడిగా నేను మీ అన్ని పోరాటాలలో ప్రత్యక్షంగా భాగస్వామిని అయ్యానని ఉన్నత విద్యా పరిరక్షణ కొరకు మీరందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. నైతిక విలువలు కలిగిన చుక్క రామయ్య, పాతూరు సుధాకర్ రెడ్డి, నాగేటి నారాయణ గార్లను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మీరందరూ మంచి సమాజ నిర్మాణముకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సభాధ్యక్షులు డాక్టర్ వస్కుల శ్రీనివాస్ మాట్లాడుతూ… నూతన సంఘ నిర్మాణం పటిష్టంగా ఉండడానికి అందరు కృషి చేయాలన్నారు. రెగ్యులర్ కాని అధ్యాపకుల కొరకు శయశక్తుల కృషి చేస్తామన్నారు.

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ఇంటర్ విద్యా ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గారు నూతన అధ్యాపకుల సంఘాన్ని స్వాగతిస్తూ మీరందరూ కూడా ప్రభుత్వ ఇంటర్ విద్యా కళాశాల కాపాటంలో ముందు ఉండాలని కోరారు.

టిగ్లా ప్రధాన కార్యదర్శి మరియు తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ రామకృష్ణ గౌడ్ మీ నూతన తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆవిర్భావంను స్వాగతిస్తున్నాం. సంఘంలో నిబద్ధత కలిగిన సభ్యులనే సంఘంలో చేర్చుకోవాలని సూచించారు. కళాశాలలో ఇతర సిబ్బందితో కలిసిమెలిసి పనిచేయాలన్నారు.

సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ మాట్లాడుతూ.. 2004 సంవత్సరంలో ఏర్పడిన నాటి నుండి నేటి రెగ్యులరైజేషన్ అయ్యేవరకు జరిగిన పోరాటాలను సవివరంగా వివరించారు. పోరాడితే పోయేది ఏమీలేదని బానిస సంకెళ్లు తప్ప అనే నినాదమును నిరూపించిన సంఘం మనది అన్నారు. అలాగే నేటి సమావేశంలో తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ 475 గా ఏర్పాటు చేసిన లోగోను ఆవిష్కరించడమైనది అనంతరం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ ఖమ్మం జిల్లా నుండి మొదటి మెంబర్షిప్ తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో 475 రాష్ట్ర నాయకులు నాయిని శ్రీనివాస్, డాక్టర్ పి. జగన్నాథం, ఎం. శ్రీనివాస్ రెడ్డి, కెపి శోభన్ బాబు, కాంపల్లి శంకర్, యు. సంగీత, ఎల్ దేవేందర్, జే. కురుమూర్తి, జే. గంగాధర్, జి. గోవర్ధన్, బొంకూరు ప్రవీణ్ కుమార్, బి. సాయిలు వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.