TS CABINATE : మంత్రిమండలి నిర్ణయాలు

హైదరాబాద్ (జూలై – 31) : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుంది (telangana carbonate decisions today)

★ మెట్రో విస్తరణ

హైదరాబాద్ మెట్రో రైల్‌ను విస్తరిస్తున్నాం. విస్తృతమైన చర్చల తర్వాత రాబోయే మూడు నాలుగేళ్లలో నిర్దేశిత ప్రతిపాదనలతో చాలా పెద్ద ఎత్తున మెట్రోను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లో ఇప్పటికే 70 కిలోమీటర్ల మెట్రోకు అదనంగా 31 కిలోమీటర్లు ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రూపంలో అందుబాటులోకి రాబోతున్నది. కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం మేరకు.. జూబ్లీ బస్టాండ్‌ వరకు తూంకుంట వరకు దాకా డబుల్‌ డెక్కర్‌ మెట్రోను ఏర్పాటు చేయబోతున్నది. ఒక లెవల్లో వాహనాలు, మరో లెవల్లో మెట్రో ఏర్పాటు చేయడానికి కేబినెట్‌ తీర్మానించింది.

★ డబుల్ డెక్కర్ ప్లైఓవర్లు

ప్యాట్నీ నుంచి కండ్లకోయ దాకా డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌ను నిర్మించాలని కేబినెట్‌ నిర్ణయించింది. హైదరాబాద్‌లో మరో ముఖ్యమైన మార్గం ఇస్నాపూర్‌ – మియాపూర్‌ వరకు మెట్రోను విస్తరించాలని, మియాపూర్‌ నుంచి లక్డీకపూల్‌ వరకు, విజయవాడ రూట్‌లో ప్రస్తుతం ఉన్న మెట్రోను ఎల్‌బీనగర్‌ నుంచి పెద్ద అంబర్‌పేట వరకు హయత్‌నగర్‌ విస్తరించాలని, వరంగల్‌ రూట్‌లో ఉప్పల్‌ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్‌ వరకు, మహబూబ్‌నగర్‌ మార్గంలో భవిష్యత్‌లో కొత్తూరు నుంచి షాద్‌నగర్‌ వరకు విస్తరించాలని నిర్ణయించింది. ఉప్పల్‌ నుంచి ఈసీఐఎల్‌ క్రాస్‌ రోడ్డు వరకు, ఓల్డ్‌ సిటీ మెట్రోను పూర్తి చేస్తాం. ఓఆర్‌ఆర్‌ చుట్టూ ఎయిర్‌పోర్టు నుంచి కందుకూరు వరకు మొత్తం కలిపి రూ.60వేలకోట్లతో మెట్రోను రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నది’ అన్నారు.

★ విద్యుత్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయుడికి ఆగస్టు 15న సన్మానం


‘వరదల్లో దాదాపు 27వేల మందికి పునరావాస కేంద్రాలకు తరలించామో.. వారు ఎక్కడివారక్కడ ఉండేలా చూడాలని కేబినెట్‌ ఆదేశించింది. అలాగే సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా ప్రస్తావించి.. తనంతట తనను తాను ఇద్దరు విద్యుత్‌ ఉద్యోగులను ప్రత్యేకంగా అభినందించారు. ఆగస్టు 15న ఇద్దరిని ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్కరించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. వారిని కేబినెట్‌ను అభినందించింది. ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న మీనయ్య అనే ఉపాధ్యాయుడు 40 మంది పిల్లలను కాపాడారు. ఆయనను కూడా సన్మానించాలని సీఎం కేసీఆర్‌, కేబినెట్‌ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖమ్మం పట్టణం నుంచి మున్నేరు వరదల నుంచి రక్షించేందుకు ఖమ్మం పొడువునా ఉన్న నది వెంట ఆర్‌సీసీ వాల్‌తో కూడిన ఫ్లడ్‌బ్యాంక్‌ను నిర్మించాలని కేబినెట్‌ తీర్మానించింది. దీనికి సంబంధించి నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించింది’ అని వివరించారు.

★ విత్తనాల సరఫరా


‘వర్షాల వల్ల చెరువులు నిండుకుండల్లా ఉన్నాయి. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని వ్యవసాయశాఖను ఆదేశించారు. 40 మంది మరణించిన వారి వివరాలను సేకరించి.. వారికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కేబినెట్‌ అధికారులను ఆదేశించింది. వరదలతో పొలాల్లో ఇసుకమేటలు వేశాయి. కొన్నిచోట్ల ఇతర సమస్యలు వచ్చాయి. వాటిని పరిశీలించి సమగ్రను వెంటనే ప్రభుత్వానికి ఇవ్వాలని కలెక్టర్లకు సీఎస్‌ ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వరదలతో తెగిన రోడ్లు, కల్వర్టులకు మరమ్మతులు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు’ అని కేటీఆర్‌ వివరించారు.

★ వరద సహాయం 500 కోట్లు

భారీ వర్షాలతో సంభవించిన వరదల నేపథ్యంలో తక్షణ సహాయం కింద రూ.500కోట్లు విడుదల చేయాలని కేబినెట్‌ నిర్ణయించిందని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం దాదాపు ఐదుగంటల పాటు జరిగింది. భేటీ అనంతరం మంత్రులతో కలిసి కేటీఆర్‌ కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘దాదాపు ఐదున్నర గంటల పాటు సమావేశమై ముఖ్యమైన విషయాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ నెల 18 నుంచి 28 వరకు పెద్ద ఎత్తున కురిసిన వర్షాలు, వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది.

అనూహ్యరీతిలో వచ్చిన అతిభారీ వర్షాల వల్ల వచ్చిన వరదలు, జరిగిన నష్టాన్ని కేబినెట్‌ అన్నిశాఖలతో చర్చించింది. సమగ్ర సమాచారన్ని సేకరించింది. పూర్వ వరంగల్‌ జిల్లాతో పాటు నిర్మల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, కొత్తగూడెంతో పాటు పది జిల్లాల్లో భారీ వర్షాలతో ప్రజలకు, వివిధ వర్గాలకు నష్టం జరిగింది. దెబ్బతిన్న పంటలు, రోడ్లు, చెరువులు, కాలువలకు జరిగిన నష్టంపై సమీక్షించింది. తక్షణ సహాయం కింద రూ.500కోట్లు నిధులు విడుదల చేయాలని ఆర్థికశాఖకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలిచ్చారు. దీన్ని ఎక్కడ అవసరం అవసరమైతే అక్కడ యుద్ధప్రాతికదికన తాత్కాలిక మరమ్మతులు చేసేందుకు నిధులు కేటాయించారు’ అని వివరించారు.

★ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం

ప్రజారవాణాను పటిష్టం చేసేందుకు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. తెలంగాణ కేబినెట్‌ అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను మంత్రులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ, అందులో పని చేసే ఉద్యోగులు, కార్మికుల విషయంలో రవాణామంత్రి, ఆర్థికశాఖ మంత్రి సంస్థతో అనుబంధం ఉన్న వారంతా సీఎం కేసీఆర్‌కు విన్నవించారు. ఆర్టీసీ కార్మికులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న శుభవార్తపై కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకున్నది.

★ 43,373 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు

ఆర్టీసీని కాపాడేందుకు, ప్రజారవాణా వ్యవస్థను పటిష్టం చేసేందుకు, సేవలను ఇంకా విస్తృత పరిచేందుకు సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ.. విధివిధానాలు, నిబంధనలను రూపొందించేందుకు అధికారులతో కూడిన సబ్‌ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఆర్టీసీ కార్మికులు ఈ విషయంలో సమ్మె చేయడం జరిగింది. వారి కోరికను మన్నిస్తూ.. అదేవిధంగా సామాజిక బాధ్యతగా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌గా గుర్తిస్తూ.. అధికారులతో కూడిన సబ్‌కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 43,373 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకున్నది.

సబ్‌ కమిటీలో అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్‌అండ్‌బీ, రవాణాశాఖ, జేఏడీ శాఖ కార్యదర్శులు, కార్మికశాఖ స్పెషల్‌ సెక్రెటరీ సభ్యులుగా ఉంటారు. పూర్తి నివేదికను వెంటనే సిద్ధం చేసి.. ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. 3వ తేదీన ప్రారంభమయ్యే సమావేశంలోనే ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియను ప్రారంభిస్తూ శాసనసభలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనున్నది. వెంటనే దానికి సంబంధిన కార్యాచరణ ప్రారంభించాలని రవాణాశాఖ, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రికి సీఎం కేసీఆర్‌ ఆదేశాలు ఇవ్వడం జరిగింది’ అని కేటీఆర్‌ తెలిపారు.

★ గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రావణ్‌, కుర్రా సత్యనారాయణ

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రావణ్‌, కుర్రా సత్యనారాయణ ప్రతిపాదిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నది. కేబినెట్‌ సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్‌ కేబినెట్‌ నిర్ణయాలను వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను అసెంబ్లీ సమావేశాలు లో తిరిగి తీర్మానం చేసి పంపుతాం. రెండోసారి తీర్మానం చేసి పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించక తప్పదు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎస్టీల నుంచి కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రావణ్‌లను గవర్నర్‌కు ప్రతిపాదిస్తూ క్యాబినెట్ తీర్మానించింది. వరంగల్ పట్టణంలో ఎయిర్ పోర్టుకు అదనపు భూమి 253 ఎకరాలు కేటాయిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖకు పంపాలని నిర్ణయం తీసుకుంది.

★ నూతన ఎయిర్ పోర్ట్స్

హైదరాబాద్‌కు మరో ఎయిర్‌పోర్టు అవసరం ఉంది. హైదరాబాద్‌లో హాకింపేట ఎయిర్‌పోర్ట్‌ను గోవా తరహాలో పౌర విమానయాన సేవలు ప్రారంభించాలని కేంద్రాన్ని కోరతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మరొక 8 మెడికల్ కాలేజీల ఏర్పాటు కు క్యాబినెట్ నిర్ణయం. రైతులు, హైదరాబాద్, వరంగల్ అభివృద్ధిపై క్యాబినెట్‌లో పలు నిర్ణయాలు తీసుకున్నది. వర్షాలు, వరదలు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పంటనష్టంపై పూర్తి నివేదిక అందాక నిర్ణయం. కేంద్రం కూడా రాజకీయం చేసుడు బంద్ చేసి, సహాయం చేయాలని కేబినెట్‌ సూచించింది. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది’ అని కేటీఆర్‌ వివరించారు.