Home > TELANGANA > CABINET MEETING – కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే…

CABINET MEETING – కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే…

BIKKI NEWS (AUG. 01) : TELANGANA CABINET DECISIONS ON AUGUST 1st.తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ భేటీ ఈరోజు జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ లు మీడియాతో పంచుకున్నారు.

TELANGANA CABINET DECISIONS ON AUGUST 1st.

కేరళలో వయనాడ్ లో భారీ వర్షాలతో పాటు కొండచరియలు విరిగిపడి చాలా మంది చనిపోయారు. కేరళలో జరిగిన విషాదంపై తెలంగాణ కేబినేట్ సంతాప తీర్మానం ఆమోదించింది. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేసింది. ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు ముందుకు వచ్చింది.

నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు జాబ్ క్యాలెండర్ ను కేబినేట్ ఆమోదించింది. అసెంబ్లీలో చర్చకు పెడుతుంది.

రేషన్ కార్డుల జారీతో పాటు రాష్ట్ర ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ తో హెల్త్ కార్డులను జారీ చేయాలని కేబినేట్ చర్చించింది. దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసేందుకు రెవిన్యూ శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, సివిల్ సప్లయిస్ మంత్రితో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

క్రీడాకారులు ఈషా సింగ్, నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్ కు హైదరాబాద్ లో 600 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిఖత్ జరీన్ కు, సిరాజ్ కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది.

ఇటీవల విధి నిర్వహణలో మరణించిన ఇంటెలిజెన్స్ డీజీ రాజీవ్ రతన్ కుమారుడు హరి రతన్ కు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినేట్ తీర్మానించింది.

ఇటీవల విధి నిర్వహణలో చనిపోయిన అడిషనల్ డీజీ పి.మురళి కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలో అసంపూర్తిగా నిలిచిపోయిన కుడి, ఎడమ కాల్వలు పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు రెండు వేల ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు అవసరమయ్యే నిధులతో సవరణ అంచనాలను రూపొందించాలని నిర్ణయం తీసుకుంది.

ఇటీవల రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వానికి తిరిగి పంపించిన ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి కేబినేట్ చర్చించింది. తిరిగి ఇద్దరి పేర్లను గవర్నర్ ఆమోదానికి పంపించాలని నిర్ణయం తీసుకుంది.

నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. రెండో విడతగా చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులకు ఆమోదం తెలిపింది. అవసరమైతే ఇథనాల్, విద్యుత్తు ఉత్పత్తికి అక్కడి ఫ్యాక్టరీల్లో ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చర్చించింది. ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు అధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి ఆ బాధ్యతలు అప్పగించింది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు