Telangana Cabinate : కేబినెట్ నిర్ణయాల పూర్తి పాఠం

హైద‌రాబాద్ (మే – 18) : డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన తెలంగాణ కేబినెట్ స‌మావేశం దాదాపు మూడు గంట‌ల‌కు పైగా కొన‌సాగిన విష‌యం విదిత‌మే. ఈ కేబినెట్ భేటీ ముగిసిన అనంత‌రం ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, గంగుల క‌మ‌లాక‌ర్‌, ప్ర‌శాంత్ రెడ్డి, మ‌ల్లారెడ్డితో క‌లిసి హ‌రీశ్‌రావు కేబినెట్ నిర్ణ‌యాల‌ను మీడియాకు వెల్ల‌డించారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణ‌యించామ‌న్నారు. 21 రోజుల పాటు అన్ని నియోజక వర్గాల్లో సంబరాలు జరపాలని నిర్ణయం తీసుకున్న‌ట్లు పేర్కొన్నారు. కులవృత్తుల వారి అభివృద్ధి కోసం మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయించామ‌ని తెలిపారు. విధివిధానాలు రూపొందించే బాధ్యత అప్పగించిన‌ట్లు హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రూ. లక్ష ఆర్థిక సహాయం అందించేలా ప్లాన్ చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

వీఆర్ఏల‌ను రెగ్యుల‌రైజ్ చేయాల‌ని నిర్ణ‌యం..

వీఆర్ఏల‌ను అంద‌ర్నీ రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయం. విధివిధానాలు ఖరారు చేయాలని సీసీఎల్ఏ న‌వీన్ మిట్టల్‌కు ఆదేశాలు జారీ చేసిన‌ట్లు తెలిపారు.అచ్చంపేట ఉమా మహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ఫేస్ 1, ఫేస్ 2 మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంద‌ని మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ 15 రోజుల్లో ప్రారంభించాలని నిర్ణయించిన‌ట్లు పేర్కొన్నారు. వనపర్తి జర్నలిస్టు అసోసియేష‌న్‌కు 10 గంటల స్థలం కేటాయింపు. ఖమ్మంలో జర్నలిస్టుల ఇళ్ల కోసం 23 ఎకరాలు స్థలం కేటాయింపు చేసిన‌ట్లు తెలిపారు. మైనార్టీ కమిషన్‌లో జైన్ కమ్యూనిటీ యాడ్ చేస్తూ నిర్ణయం, కమిషన్ సభ్యులుగా ఒకరికి అవకాశం క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు. టీఎస్‌పీఎస్సీలో 10 పోస్టుల మంజూరు చేసిన‌ట్లు మంత్రి హ‌రీశ్‌రావు వెల్ల‌డించారు.

84 గ్రామాల‌కు కూడా అవే రూల్స్

111 జీఓ పూర్తిగా ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు మంత్రి స్ప‌ష్టం చేశారు. 84 గ్రామాల ప్రజలు ఎంతో విజ్ఞప్తి చేస్తున్నారు. ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నార‌ని హ‌రీశ్‌రావు తెలిపారు. హెచ్ఎండీఏ భూముల వలే, ఈ గ్రామాలకు కూడా అవే రూల్స్ ఉంటాయి. హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాలు కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామ‌న్నారు. వీటితో పాటు మూసీని కాళేశ్వరం జలాలతో లింక్ చేయాలని నిర్ణయించిన‌ట్లు హ‌రీశ్‌రావు తెలిపారు.

33 జిల్లాల్లో డీఎంహెచ్‌వో పోస్టులు మంజూరు

ఆరోగ్య శాఖలో రీ ఆర్గనైజింగ్‌లో భాగంగా 33 జిల్లాలో డీఎంహెచ్‌వో పోస్టులను మంజూరు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ పట్టణ జనాభాకు మరింత వైద్య సేవలు అందేలా జీహెచ్ఎంసీ ప‌రిధిలోని 6 జోన్లకు అనుగుణంగా 6 డీఎంహెచ్‌వోలు ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో మొత్తం 38 డీఎంహెచ్‌వోలు పని చేస్తారు. 40 మండలాల్లో కొత్త పీహెచ్‌సీలు మంజూరు చేయాలని నిర్ణయించిన‌ట్లు హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. అర్బన్ పీహెచ్‌సీల‌లో ఇప్పటి వరకు కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. పర్మినెంట్‌గా ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించామ‌ని తెలిపారు.

న‌కిలీ విత్త‌నాల విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తాం.

రైతు బిడ్డ సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టార‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో మార్పుల కోసం వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామ‌న్నారు. వడగళ్ల వాన వల్ల ఎంతో నష్ట పోయాం, పంట కాలం నెల ముందుకి జరపాలని ప్రణాళిక ర‌చిస్తామ‌ని చెప్పారు. నాడు 10 జిల్లాలో 9 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలే. నేడు దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది అంటే, దానికి సీఎం కేసీఆర్ నిర్ణయాలు కారణం. అకాల వర్షాల వల్ల నష్టపోవడం వద్దు అని నెల ముందు పంట జరపాలని యోచిస్తున్నాం. ఎలా ముందుకు తేవాలి అనే దానిపై సబ్ కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. నకిలీ విత్తనాలు విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం. ఎలాంటి వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని, అరెస్ట్ చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామ‌న్నారు. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు, ఒక్క రైతు కూడా మోసపోవద్దు. దీనిపై కూడా సబ్ కమిటీ పని చేస్తుంది. మక్కలు, జొన్నలు కొనుగోలు చేసేలా ప్రభుత్వం తరుపున గ్యారెంటీ ఇస్తూ నిర్ణయం తీసుకున్న‌ట్లు హ‌రీశ్‌రావు వెల్ల‌డించారు.