ఉపాధ్యాయుల పదోన్నతులు నెలాఖరులోగా పూర్తి చేయాలి – సబిత ఇంద్రా రెడ్డి

గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉపాధ్యాయుల పదోన్నతులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబిత ఇంద్రా రెడ్డి అన్నారు.
విద్యా శాఖ మంత్రి మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ మరియు విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి, విద్యా శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు.

బోధన మరియు బోధనేతర సిబ్బంది యొక్క వివిధ క్యాటగిరీల వారీగా ప్రమోషన్లను పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. బదిలీలు, మధ్యాహ్న భోజనం, టెట్ పరీక్ష, విద్యా సంస్థల ప్రారంభం తదితర అంశాలపై చర్చించారు. గౌరవ ముఖ్యమంత్రి తో చర్చించిన తరువాత గౌరవ విద్యా శాఖ మంత్రి ఈ అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గౌరవనీయ ముఖ్యమంత్రి సూచనలను పునరుద్ఘాటిస్తూ ప్రమోషన్ల కోసం ప్రస్తుతం ఉన్న వ్యవస్థకు అనుగుణంగా ఈ నెలా ఖరులోగా అన్ని పదోన్నతులను పూర్తి చేయాలని అన్నారు.

ఈ సమావేశంలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి చిత్రా రామచంద్రన్, జి.ఎ.డి ముఖ్య కార్యదర్శి శ్రీ వికాస్ రాజ్, ఇంటర్ మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి శ్రీ ఒమర్ జలీల్ , సాంకేతిక మరియు కళాశాల విద్యా శాఖ కమీషనర్ శ్రీ నవీన్ మిట్టల్, పాఠశాల విద్యా శాఖ కమీషనర్ శ్రీమతి దేవసేన ఇతర అధికారులు పాల్గొన్నారు.

Follow Us@