TEACHER TRANSFERS CASE : ఆగస్టు 23కు వాయిదా

హైదరాబాద్ (ఆగస్టు – 15) : తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై విచారణను ఆగస్టు 23న చేపడతామంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ టి. వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం తెలిపింది.

ఉపాధ్యాయుల బదిలీల్లో స్పౌజ్ కేసులకు, ఉపాధ్యాయ సంఘాల సభ్యులకు అదనపు పాయింట్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ జె. రామచంద్రరావు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరపున ఎం. రాంగోపాల్ రావులు వాదనలు వినిపిస్తూ… “కొందరు పిటిషన్లు దాఖలు చేయడంతో 60 వేల మందికి పైగా ఉపాధ్యాయుల బదిలీలు గత ఫిబ్రవరి నుంచి ఆగిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఒకే ప్రాంతం లేదంటే సమీపంలో ఉండేలా చూడటానికే అదనపు పాయింట్లు కేటాయించాం” అని తెలిపారు. భార్యాభర్తలు ఒకేచోట ఉండాలన్నదే తమ ఉద్దేశమని, దీనికి సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం ఇటీవల సవరించిందని తెలిపారు.

దీనిపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తంచేస్తూ చట్ట సవరణ లేకుండా బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం తుది విచారణ వాయిదా వేసింది.