హైదరాబాద్ (ఆగస్టు 13) : తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుళ్ల శిక్షణ రెండు విడతల్లో చేపట్టేందుకు పోలీస్ అధికారులు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థుల జాబితాను గతంలోనే TSLPRB వెల్లడించింది. ఇటీవల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ను పూర్తి చేసింది. ప్రస్తుతం కటాఫ్ మార్కుల ప్రక్రియను ముగించే పనిలో నిమగ్నమైంది.
ఇప్పటికే కొందరు అభ్యర్థులు EWS రిజర్వేషన్ పై హైకోర్టుకు వెళ్లారు. అన్నీ సకాలంలో జరిగితే సెప్టెంబర్ మొదటి, లేదా రెండోవారంలో తుది ఫలితాలను విడుదల చేయనున్నట్టు తెలిసింది. ఫలితాలు వెల్లడి కాగానే కానిస్టేబుళ్ల శిక్షణ ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.
తొలిదశలో సివిల్, ఏఆర్, డ్రైవర్, టెక్నికల్ తత్సమాన పోస్టుల్లో ఎంపికయ్యే 9,871 మందికి, మలిదశలో 5,010 మంది బెటాలియన్స్ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.
మొత్తం 28 శిక్షణ కేంద్రాల్లో 14,881 మందికి ట్రైనింగ్ ఇస్తారు. ఈసారి ఎంపికైన వారికి శిక్షణ ఇస్తూనే.. మరోవైపు క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్ గురించి ఎస్బీ వెరిఫికేషన్ చేస్తారని తెలిసింది. శిక్షణకు పిలిచిన తర్వా తనే ఎస్బీ వెరిఫికేషన్ కూడా మొదలుపెడతారని తెలిసింది.