SUPREME COURT VERDICTS 2024 : సుప్రీం కోర్టు ప్రధాన తీర్పులు 2024

BIKKI NEWS : Supreme court main verdicts 2024 for competitive exams. 2024లో దేశ అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన 10 ప్రధానమైన తీర్పులను పోటీ పరీక్షల నేపథ్యంలో క్లుప్తంగా చూద్దాం.

Supreme court main verdicts 2024 for competitive exams.

1) ఎన్నికల బాండ్లు:

ఎన్నికల బాండ్ల అమ్మకం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీం కోర్టు ఫిబ్రవరి 15న తీర్పు చెప్పింది. రాజకీయ పార్టీలకు ఎన్నికల వేళ విరాళాలు సమకూర్చేందుకు ప్రవేశపెట్టిన విధానం ఎంతమాత్రం సమర్ధనీయం కాదని తీర్పు చెప్పింది.

2) బిల్కిస్‌ బానో కేసు :

బిల్కిస్‌ బానో అనే మహిళను గ్యాంగ్‌ రేప్‌ చేయడమే కాక, ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని దారుణంగా హత్య చేసిన కేసులో నిందితులు 11 మందికి క్షమాభిక్ష పెడుతూ గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు ఈ ఏడాది జనవరి 8న కొట్టివేసింది.

3) ఎస్సీ, ఎస్టీల కోటా ఉప వర్గీకరణ:

ఎస్సీ, ఎస్టీ కులాలను ఉప వర్గీకరణ చేసుకోవచ్చునని సుప్రీం కోర్టు ఆగస్టు 1న చారిత్రక తీర్పు చెప్పింది. ఇలా వర్గీకరణ చేసి ఆయా వర్గాలకు ఉద్యోగాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో అదనపు ప్రయోజనాలు చేకూర్చవచ్చునని తెలిపింది.

4) లంచగొండి నేతలు చట్టానికి అతీతులు కాదు:

‘చట్టసభల్లో ఒక వ్యక్తికో పార్టీకో అనుకూలంగా ఓటు వేయడానికో, లేదా ఏదైనా అంశం గురించి మాట్లాడటానికో లంచం, బహుమతులు తీసుకునే ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రాసిక్యూషన్‌ నుంచి తప్పించుకోలేరు.’ అని సీజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం మార్చి 4న తీర్పు చెప్పింది. 1993లో ప్రధాని పీవీ నరసింహారావుపై అవిశ్వాసం పెట్టిన క్రమంలో ఐదుగురు పార్టీ నేతలు లంచాలు తీసుకోవడంపై నమోదైన జేఎంఎం లంచం కేసులో చట్టసభ సభ్యులకు అనుకూలంగా ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేస్తున్నట్టు ధర్మాసం పేర్కొంది.

5) పౌరసత్వ చట్టం సెక్షన్‌ 6ఏ:

అస్సాంలోని అక్రమ వలసదారులకు భారత పౌరసత్వం కల్పించే పౌరసత్వ చట్టం సెక్షన్‌ 6ఏకు రాజ్యాంగ చెల్లుబాటు ఉంటుందని సుప్రీం కోర్టు అక్టోబర్‌ 17న తీర్పు చెప్పింది.

6) చైల్డ్‌ పోర్నోగ్రఫీ నేరం:

పిల్లలకు సంబంధించిన అశ్లీల మెటీరియల్‌ కలిగి ఉండటం పోక్సో చట్టం కింద నేరమేనని సుప్రీం కోర్టు సెప్టెంబర్‌ 23న తీర్పు చెప్పింది.

7) అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ హోదా:

కేంద్ర చట్ట ప్రకారం ఏర్పడిన అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ హోదా ఉందని సుప్రీం కోర్టు నవంబర్‌ 8న తీర్పు చెప్పింది. ఆర్టికల్‌ 30 కింద రాజ్యాంగపరంగా ఏఎంయూకు ఈ హోదా లభిస్తుందని తీర్పు వెలువరించింది.

8) యూపీ మదర్సా విద్యా చట్టం:

ఉత్తరప్రదేశ్‌ మదర్సా బోర్డు విద్యా చట్టం-2004 రాజ్యాంగబద్ధమేనని నవంబర్‌ 5న సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. యూపీ మదర్సా చట్టం రాజ్యాంగ విరుద్ధమని, మదర్సాల్లో చదువుతున్న విద్యార్థులను అధికారిక పాఠశాల విద్యావ్యవస్థలో చేర్చాలంటూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును తిరస్కరించింది.

9) కుల ప్రాతిపదికన జైళ్లలో వివక్ష:

కుల ప్రాతిపదికన జైళ్లలో జరుగుతున్న వివక్షపై అక్టోబర్‌ 13న దేశ అత్యున్నత న్యాయస్థానం చారిత్రక తీర్పు చెప్పింది. శారీరక శ్రమ విభజన, బ్యారక్‌ల విభజన తదితర అంశాలతో కుల ఆధారిత వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.

10) బుల్డోజర్‌ న్యాయం తప్పు:

బుల్డోజర్‌ న్యాయం పేరిట రాష్ర్టాలు ఇష్టానుసారం కూల్చివేతలు చేపట్టడాన్ని సుప్రీం కోర్టు నవంబర్‌ 13న తప్పుబట్టింది. బుల్డోజర్‌ న్యాయంలో కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయమూర్తి పాత్రను పోషిస్తూ ఒక వ్యక్తిని దోషి అని నిర్ధారించి శిక్షను వేయడమే కాక దానిని అమలు చేస్తున్నదని.. ఇది తప్పని వ్యాఖ్యానించింది.

నూతన న్యాయ చట్టాలు

ఈ ఏడాది న్యాయవ్యవస్థలో కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. చిరకాలంగా దేశంలో అమలవుతున్న పాత చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియం(బీఎస్‌బీ)ని ప్రవేశపెట్టింది.

నూతన న్యాయ దేవత

కళ్లకు గంతలతో ఉండే న్యాయదేవత విగ్రహం స్థానంలో కళ్లకు గంతలు లేకుండా, చేత రాజ్యాంగాన్ని ధరించిన కొత్త న్యాయదేవత విగ్రహాన్ని సుప్రీం కోర్టు ప్రాంగణంలో ఆవిష్కరించారు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు