విద్యార్థుల హజరు విషయంలో ఒత్తిడి తేవద్దు – మంత్రి సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ రాష్ట్రం లో కోవిడ్ అనంతరం విద్యా సంస్థల పునఃప్రారంభం పై మంత్రులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీమతి సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ లతో వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ నేడు నాంపల్లిలోని రుసా భవన్ లో సమావేశమైంది.

విద్యాసంస్థలు ప్రారంభించేందుకు ఈనెల 25లోపు సిద్ధం కావాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. తరగతి గదిలో విద్యార్థుల మధ్య కనీసం ఆరడుగుల దూరం ఉండాలన్నారు. విద్యాసంస్థలు, గురుకులాలు, వసతి గృహాలు తెరవడంపై మంత్రులు సబితా, సత్యవతి రాథోడ్‌, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.

ఫిబ్రవరి 1 నుంచి 9వ తరగతి నుంచి ఆపై కోర్సులకు తరగతులు ప్రారంభించాలి. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఆందోళన వద్దు. విద్యార్థుల భవిష్యత్‌ను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. పుస్తకాలు, యూనిఫారాలు ఇప్పటికే చేరవేశాం. రేపటి సమావేశానికి తల్లిదండ్రుల కమిటీని ఆహ్వానించాం. విద్యార్థుల హాజరు విషయంలో ఎలాంటి ఒత్తిడి ఉండదు. హాస్టళ్లలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు

Follow Us@