హైదరాబాద్ (డిసెంబర్ – 02) : విద్యార్థుల స్కాలర్‌షిపుల రద్దు వల్ల పేద విద్యార్థులకు కేంద్రం ప్రభుత్వం చదువులకు దూరం చేస్తుందని తక్షణమే ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని భారత విద్యార్ధి ఫెడరేషన్ (SFI) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి, టి. నాగరాజు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం నుండి 8వ తరగతిలోపు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ పేద విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిపులను ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం సరైందికాదని తక్షణమే ఈ ప్రకటనను వెనక్కు తీసుకోవాలని ఎస్.ఎఫ్.ఐ. డిమాండ్ చేస్తుందన్నారు. పేద విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్‌షిపులు వారి చదువుకు ఎంతో కొంత ఉపశమనంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉచిత నిర్బంధ విద్యను సాకుగా చూపి కేవలం 9,10 తరగతుల విద్యార్థులకే ఈ స్కాలర్‌షిపులను పరిమితం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. దీని వల్ల ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులు చదువులకు దూరమై డ్రాపౌట్స్ పెరిగే ప్రమాదముందన్నారు. దేశం 100 శాతం అక్షరాస్యత సాధించాలని ఒకవైపు చెబుతూనే ఇలాంటి ప్రమాదకర నిబంధనలు తేవడంతో లక్ష్యం నెరవేరదు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు. లేనట్లయితే ఎస్ఎఫ్ఐ మిగతా విద్యార్థి, ప్రజాసంఘాలను కలుకొని ఉద్యమమం చేపడుతామని చెప్పారు.