వరంగల్ (జనవరి – 03) : యావత్ మహిళా లోకానికి సావిత్రిబాయి పూలే జీవితం (Savithribai phule Jayanthi) ఆదర్శప్రాయమని ఇంటర్మీడియట్ విద్యా వరంగల్ జిల్లా నోడల్ అధికారి మాధవరావు అన్నారు. దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఎంతోమంది మహిళల జీవితాల్లో ఆమె వెలుగును నింపారని, ఆమె ఆశయ సాధనకు మహిళలు అంతా కృషి చేయాలని కోరారు. బుధవారం రోజున రంగసాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు*
ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ఆయన పూలమాల వేసిన అనంతరం మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే బాటలోని నేడు లక్షలాదిమంది మహిళలు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారని అన్నారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ కే. శోభాదేవి మాట్లాడుతూ నేడు మహిళా లోకం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగడానికి సావిత్రిబాయి పూలే అడుగుజాడలే కారణమన్నారు. కేవలం ఉపాధ్యాయ వృత్తిలోనే కాకుండా అనేక రంగాల్లో కూడా మహిళలు రాణిస్తున్నారని, ఇది దేశాభివృద్ధికి సూచిక అని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.