కాంట్రాక్టు ఉద్యోగ క్రమబద్దీకరణకై కేసీఆర్ కి “సంక్రాంతి సందేశం”

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులు/లెక్చరర్లు తమ క్రమబద్ధీకరణ గురించి ఈరోజు వినూత్న పద్ధతిలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుకి,” సంక్రాంతి సందేశం” పేరిట రాష్ట్ర వ్యాప్తంగా విన్నూత్న పద్ధతిలో ఆన్లైన్ ద్వారా వినతి పత్రాలు పంపించినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగుల /లెక్చరర్ల జీవో నెంబర్ 16 అమలు సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తెలిపారు .

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని 2016 లో జీవో నెంబర్ 16 ఇచ్చినప్పటికీ… హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వలన ఇప్పటివరకు క్రమబద్దీకరణ అమలు జరగలేదని, దీంతో ఎంతో ఆశతో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు గత నాలుగు సంవత్సరాలుగా క్రమబద్ధీకరణ ఫలితాలు అందకుండానే రిటైర్మెంట్ కావడం జరిగిందని.. కొంతమంది కొన్ని కారణాల వల్ల చనిపోవడం కూడా జరిగిందని… వీరి కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక, సామాజిక భద్రత, లేకపోవటంవల్ల వారి కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయని తెలియజేశారు.

గత డిసెంబరు 7న క్రమబద్ధీకరణ విషయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు తొలగిపోవడం వల్ల క్రమబద్దీకరణకు సానుకూలమైన పరిస్థితి ఏర్పడిందని తెలియజేస్తూ, తెలంగాణలోని ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులు అందరూ కూడా తమ క్రమబద్ధీకరణ విషయంలో మార్గదర్శక సూత్రాలు ఇవ్వాల్సిందిగా ఈరోజు ముఖ్యమంత్రికి మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆన్లైన్ ద్వారా వినతిపత్రం పంపించినట్లు తెలియజేశారు.

ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాల్లో సంక్రాంతి సంతోషాలు ఉండేటట్లు చేయాలని ఈ సందర్భంగా కోరారు.