వివాదాస్పదం అవుతున్న మహిళా జూనియర్ అధ్యాపకురాలి రీపోస్టింగ్

ఇంటర్మీడియట్‌ విద్యాశాఖలో సెలవు పెట్టకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా దాదాపు 17 ఏళ్లుగా డ్యూటీకి రాని ఓ మహిళా అధ్యాపకురాలికి ఇంటర్‌ విద్యాశాఖ రీపోస్టింగ్‌ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.

1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీపీఎస్సీ ద్వారా జువాలజీ లెక్చరర్‌గా ఎంపికైన మహిళకు.. కరీంనగర్‌ జిల్లాలోని ఓ మహిళా జూనియర్‌ కాలేజీలో పోస్టింగ్‌ ఇచ్చారు. 2003 నుంచీ ఆమె విధులకు గైర్హాజరైనట్టు (అబ్‌స్కాండ్‌) తెలిసింది. దాదాపు 17 ఏళ్లుగా ఆమె విదేశాల్లోనే ఉన్నారని, ఇటీవలే తిరిగి వచ్చాక.. తనకు పోస్టింగ్‌ ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకుంటే గతంలో పనిచేసిన కాలేజీలోనే పోస్టింగ్‌ ఇస్తూ గతనెల 31వ తేదీన ఉత్తర్వులు జారీ అయినట్టు సమాచారం.

సదరు మహిళ అధ్యాపకురాలు ప్రభుత్వానికి, కమిషనర్‌ కార్యాలయానికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఆదేశాల ప్రకారమే ఆర్డర్‌ ఇచ్చినప్పటికీ… ఆమె విధులకు గైర్హాజరుకావడం, విదేశాలకు వెళ్లడంపై విచారణకు ఆదేశించినట్లు సమాచారం. విచారణ తర్వాత రీపోస్టింగ్ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు నుండి సమాచారం.

Follow Us @