గెస్ట్ లెక్చరర్ లను రెన్యూవల్ చేయాలి – దామెర, దార్ల

హైదరాబాద్ (ఆగస్టు – 10): ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ జూనియర్ కాలేజీలల్లో గత 8, 9 సంవత్సరాలుగా పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల రెన్యూవల్ విషయంలో శాపంగా మారుతుందని గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్, అసోసియేట్ ప్రెసిడెంట్ కె మహేష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఎం బాబురావు, కోశాధికారి బండి కృష్ణ మరియు రాష్ట్ర కార్యవర్గ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో వారు మాట్లాడుతూ…ఈ విద్యాసంవత్సరం జూన్ 15 నుండే కళాశాలలు ప్రారంభమైనా కళాశాలల్లో పనిచేస్తున్న అన్ని విభాగాల లెక్చరర్లు అధికారికంగా కొనసాగుతున్నా..గెస్ట్ లెక్చరర్ల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విద్యా సంవత్సరంలో గెస్ట్ లెక్చరర్లను తీసుకునే విషయంలో అనుమతి కోరుతూ..తేది: 30-05-2022 నాడు ఇంటర్మీడియట్ కమీషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ ప్రతిపాదనలను ఉన్నత విద్యాశాఖ అనుమతి కోసం పంపగా వారు ఆమోదించి ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కు పంపగా వారు కూడా అనుమతి ఇచ్చారు. కానీ దానికి సంబందించిన ప్రతిపాదనలలో “యూనిట్ వైజ్ సర్వీస్ డిటైల్స్” లేనందున వెంటనే తేది: 02-07-2022 న గెస్ట్ లెక్చరర్ల వివరాలను సేకరించి త్వరగా పంపాలని ఉన్నత విద్యాశాఖ మెమో జారీ చేశారు. ఈ మెమో వెళ్ళి ఇప్పటికీ దాదాపు నెలన్నర దాటుతున్నా ఇంతవరకు “గెస్ట్ లెక్చరర్ల డాటా” ను ఉన్నత విద్యాశాఖ కు పంపడం లేదు. అన్ని జిల్లాల నుండి గెస్ట్ లెక్చరర్ల శాంక్షన్డ్, నాన్ శాంక్షన్డ్ వేకెన్సీ వివరాలను సేకరించి సిద్ధం చేసినప్పటికీ ఇంతవరకూ ప్రభుత్వ ఆమోదం కోసం పంపకపోవడం వెనుక ఆంతర్యమేంటో అర్థ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అదే విధంగా గత విద్యాసంవత్సరం మానవతా ధృక్పథంతో గెస్ట్ లెక్చరర్లను యధావిధిగా కొనసాగించిన ప్రకారమే ఈ విద్యాసంవత్సరం కూడా ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ఉన్నతాధికారులు సానుకూలంగా ఉండగా..కేవలం గెస్ట్ లెక్చరర్ల వివరాలను పంపకుండా దాదాపు 2000 మంది గెస్ట్ లెక్చరర్లను 2 నెలలుగా ఇబ్బందులకి గురి చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయం గూర్చి పలుమార్లు ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంటర్ కమీషనర్ లను కలవగా వారు సానుకూలంగా స్పందించి జూన్ 15 నుండే గెస్ట్ లెక్చరర్లను యధావిధిగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారికంగా నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారని తెలిపారు. గత విద్యాసంవత్సరం పెండింగ్ వేతనాలు విడుదల కాకపోవడం తో ఇబ్బందులు పడుతూ కూడా ఈ విద్యాసంవత్సరం జూన్ 15 నుండే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీలల్లకు గెస్ట్ లెక్చరర్లు వెళుతూ అడ్మిషన్ల నమోదు చేయడమే గాక, సెకండియర్ విద్యార్థులకు తరగతులను సైతం నిర్వహిస్తున్నారు.

ఇన్ని ఇబ్బందులను ఎదుర్కుంటూ కూడా కళాశాలలకు హాజరౌతున్న గెస్ట్ లెక్చరర్ల కొనసాగింపు విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ ఫైనల్ ఆర్డర్స్ వచ్చే విషయంలో గెస్ట్ లెక్చరర్ల డాటా సేకరించి మరీ ఉన్నత విద్యాశాఖ కు పంపకుండా ఇంటర్ బోర్డు అధికారులు వహిస్తున్న నిర్లక్ష్యాన్ని మంత్రి, ఉన్నతాధికారులు గమనించి చర్యలు తీసుకోవాలి. 2 రోజుల్లో డాటా వెళ్ళకపోతే గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో “ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ముట్టడి” కి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు..

Follow Us @