Home > 6 GUARANTEE SCHEMES > Rythu Bandhu – రైతుబంధుకు ఉపగ్రహ సర్వే.!

Rythu Bandhu – రైతుబంధుకు ఉపగ్రహ సర్వే.!

BIKKI NEWS (FEB. 20) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా (రైతుబంధు) పథకం అమలుకు ఉపగ్రహం ద్వారా రిమోట్‌ సెన్సింగ్‌ సర్వే చేపట్టాలని (Remote sensing survey for rythu bandhu scheme) నిర్ణయించినట్టు సమాచారం. ఉపగ్రహ చిత్రాల ద్వారా సాగు భూములు, బీడు భూముల లెక్కలు తేల్చీ పథకం అమలుకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు సమాచారం

ఇందుకోసం హైదరాబాద్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌ఈ) సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఎన్‌ఆర్‌ఎస్‌ఈ కేంద్ర సాంకేతిక శాఖ పరిధిలో ఉండటంతో కేంద్రం అనుమతి తీసుకునేందుకు ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఢిల్లీకి వెళ్లి అక్కడి ఉన్నతాధికారులతో చర్చలు జరిపినట్టు సమాచారం.

సర్వేకు ఎన్‌ఆర్‌ఎస్‌ఈ సూత్రప్రాయ అంగీకారం తెలపడంతో త్వరలోనే ఇందుకు సంబంధించిన కార్యకలాపాలను ప్రారంభించనున్నట్టు తెలిసింది. వచ్చే వానకాలం నుంచి రైతుభరోసా అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆ లోపు వివరాలన్నీ సేకరించేలా వ్యవసాయ శాఖ కార్యాచరణ చేపట్టింది.

భూముల వివరాలు రాగానే కొత్త మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉన్నది. ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని నూతన ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో 1.52 కోట్ల ఎకరాలకు ఏటా దాదాపు రూ.23 వేల కోట్ల బడ్జెట్‌ అవసరమని అంచనా.