DIABETES – షుగర్ వ్యాధికి రెడ్‌ లైట్‌ థెరపీ

BIKKI NEWS (FEB. 22) : RED LIGHT THEROPHY FOR DIABETES PATIENTS – భోజనం చేశాక మన శరీరంపై కొన్ని నిమిషాలపాటు (15 నుంచి 45 నిమిషాలు) ఎరుపు రంగు కాంతి (670 నానోమీటర్ల పరిధి) పడేట్టు చేస్తే, రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు 28 శాతం తగ్గే అవకాశముందని, తద్వారా శరీరంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయని యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ పరిశోధకులు తేల్చారు.

పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్‌ మైఖేల్‌ పానర్‌ మాట్లాడుతూ, ‘శరీరంపై ఎరుపు రంగు కాంతి పడగానే.. జీవకణంలోని మైటోకాండ్రియా యాక్టివ్‌ అవుతుంది. వెంటనే శక్తిని ఉత్పత్తి చేయటం మొదలు పెడుతుంది. భోజనం చేసిన తర్వాత గ్లూకోజ్‌ స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా ఇది అడ్డుకుంటుంది’ అని అన్నారు.

ఎల్‌ఈడీ లైట్లలో నీలిరంగు (బ్లూ లైట్‌) కాంతి ఆరోగ్యానికి హాని చేస్తుందన్నారు. ప్రపంచమంతా ఇప్పుడు ఎల్‌ఈడీ లైట్లనే వాడుతున్నందున ఈ ముప్పును గుర్తించాలన్నారు.

రెడ్‌ లైట్‌ థెరపీతో (ఎరుపు రంగు కాంతి) డయాబెటిస్‌ను నియంత్రణలోకి తీసుకురావొచ్చని, దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.