PSLV C52 ప్రయోగం విజయవంతం

పోలార్ లాంచ్ శాటిలైట్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ52 మూడు ఉపగ్రహాలతో సోమవారం తెల్లవారు జామున 5.59 నిముషలకు నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగశాల నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ లాంచ్ విజయవంతం అయింది.

ఆర్ఐశాట్1(ఈవోఎస్ -04), ఐఎన్ఎస్-2టీడీ, ఇన్స్పైర్ శాట్ అనే మూడు ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ52.. నిర్ణిత సమయానికి ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

◆ మూడు ఉపగ్రహాల ప్రత్యేకతలు :-

● ఆర్ఐశాట్1(ఈవోఎస్ -04) :– 1710 కిలోల బరువున్న ఈ శాటిలైట్ ద్వారా వ్యవసాయ, అటవీ, నీటి వనరుల సమాచారం సేకరించనున్నారు. ఇమేజ్ డేటా ఆధారంగా పనిచేసే ఈ ఉపగ్రహంలో అధిక డేటా నిర్వహణ వ్యవస్థలు, స్టోరేజ్ కెపాసిటీ ఉన్నాయి. ఆర్ఐశాట్ (ఈవోఎస్ -04)గా పిలిచే ఈ ఉపగ్రహం పదేళ్ల పాటు సేవలు అందించనుంది.

ఐఎన్ఎస్-2టీడీ :- 17.50 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని భారత్, భూటాన్ శాస్త్రవేత్తలు కలిసి రూపొందించారు. భవిష్యత్తు సైన్స్ అవసరాలు, పేలోడ్స్ ప్రయోగాల నిమిత్తం ఈ ఐఎన్ఎస్-2టీడీ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఆరు నెలల పాటు ఈ ఉపగ్రహ సేవలను వినియోగించుకోనున్నారు.

ఇన్స్పైర్ శాట్ 1 :- 8.10 కిలోల అతి తక్కువ బరువుగల ఈ “ఇన్స్పైర్ శాట్ 1” ఉపగ్రహాన్ని దేశంలోని పలు యూనివర్సిటీ విద్యార్థులు సంయుక్తంగా రూపొందించారు. కాంపాక్ట్ అయనోస్పియర్ ప్రోబ్ అనే సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ “ఇన్స్పైర్ శాట్ 1”.. భూమిపై అయనోస్పియర్ ను అధ్యయనం చేయనుంది. ఏడాది పాటు ఈ ఉపగ్రహ సేవలు వినియోగించుకోనున్నారు.

ఇస్రో నూతన చైర్మన్ సోమనాథన్ ఆధ్వర్యంలో చేపట్టిన మొట్టమొదటి ఉపగ్రహ ప్రయోగం ఇది. అనుకున్న సమయానికే ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో చైర్మన్ సోమనాథన్ సంతోషం వ్యక్తం చేశారు.

Follow Us @