BIKKI NEWS (NOV. 06) : Private properties cannot be acquired – supreme court. ఉమ్మడి ప్రయోజనాల’ పేరుతో ప్రభుత్వాలు అన్ని రకాల ప్రైవేటు ఆస్తులను స్వాధీనం చేసుకోవడం కుదరదని, అందుకు రాజ్యాంగం వీలు కల్పించడం లేదని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సంధర్భంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనంపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది.
Private properties cannot be acquired – supreme court
‘ ప్రైవేట్ ఆస్తులను సామాజిక వనరులుగా పరిగణించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చా? లేదా? అనే అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల విస్తృత ధర్మాసనం 7:2 మెజార్టీతో మంగళవారం 193 పేజీల తీర్పును వెలువరించింది.
ఈ తీర్పుతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో పాటు విస్తృత ధర్మాసనంలో సభ్యులుగా ఉన్న జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ జస్టిస్ రాజేశ్ బిండాల్, జస్టిస్ ఎస్‌సీ శర్మ, జస్టిస్ ఏజీ మనీశ్ పూర్తిగా ఏకీభవించగా.. జస్టిస్ బీవీ నాగరత్న పాక్షికంగా ఏకీభవించారు. మరో సభ్యుడైన జస్టిస్ సుధాంశు ధులియా ఈ తీర్పును వ్యతిరేకించారు.
వనరుల స్వభావం, కొరత వంటి అంశాలు ముఖ్యం
‘ఆర్టికల్ 39(బీ) కింద ప్రైవేటు ఆస్తులను సమాజ వనరులుగా భావించవచ్చా అనే ప్రశ్నకు ‘అవును’ అనేది సిద్ధాంతపరంగా సమాధానం. ప్రైవేటు ఆస్తులను సమాజ వనరుల్లో భాగంగా చూడొచ్చు. అయితే, రంగనాథరెడ్డి కేసులో గతంలో జస్టిస్ కృష్ణ అయ్యర్ ఇచ్చిన తీర్పుతో ఏకీభవించలేం. కేవలం సమాజ అవసరాలకు వినియోగించడానికి అర్హత ఉందనే కారణంతో వ్యక్తుల సొంత ఆస్తిని సమాజ వనరుగా చూడలేం. వనరు స్వభావం, లక్షణాలు, కొరత, సమాజ శ్రేయస్సుపై దాని ప్రభావం, ఆ వనరు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండటం వల్ల పర్యవసానం వంటి అంశాలపై ఏదైనా ప్రైవేటు ఆస్తి సమాజ వనరా? కాదా అనేది ఆధారపడి ఉంటుంది. ప్రజా విశ్వాసాన్ని కూడా ఇక్కడ అన్వయించుకోవచ్చు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా, ఆస్తులను సేకరించేందుకు ప్రభుత్వాలకు చట్టాల నుంచి ఆర్టికల్ 31సీలోని మొదటి భాగం రక్షణ కల్పిస్తుందని చెప్పిన కేశవానంద భారతి తీర్పు కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని మాత్రం కొట్టేస్తున్నట్టు పేర్కొన్నది.
సీజేఐ వ్యాఖ్యలను వ్యతిరేకించిన ఇద్దరు న్యాయమూర్తులు
1977లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వీఆర్ కృష్ణ అయ్యర్ ఇచ్చిన తీర్పులను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తప్పుబట్టారు. ఇది కఠినమైన ఆర్థిక విధానాన్ని ప్రతిపాదిస్తున్నదని పేర్కొన్నారు. ‘ఆర్టికల్ 39(బీ)లో అన్ని ప్రైవేటు ఆస్తులను చేర్చడం నిర్దిష్ట ఆర్థిక ఆలోచనా విధానం తో ప్రభావితం కావడమే. భూస్వామ్య, పెట్టుబడిదారీ ఆస్తి కోటలను కూల్చేందుకు ఆర్టికల్ 39(బీ) ప్రభుత్వానికి అధికారాన్ని ఇచ్చిందని జస్టిస్ కృష్ణ అయ్యర్ భావించారు.’ అని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ వ్యా ఖ్యానించారు. జస్టిస్ కృష్ణ అయ్యర్ తీర్పులను ఉద్దేశించి సీజేఐ చేసిన వ్యాఖ్యలను జస్టిస్ నాగరత్న, జస్టిస్ సుధాంశు ధులియా వ్యతిరేకించారు. సీజేఐ పరిశీలనలు అసమంజసమని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. ఈ విమర్శ కఠినంగా ఉందని, దీని ని నివారించాల్సి ఉండేదని జస్టిస్ ధులియా అన్నారు.