పాత అతిధి అధ్యాపకులకు ప్రాధాన్యత ఇవ్వండి – కమీషనర్ ఒమర్ జలీల్

తెలంగాణ రాష్ట్రంలోని 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2021 – 22 విద్యాసంవత్సరానికి గాను గత సంవత్సరం పని చేసినటువంటి అతిధి అధ్యాపకులను ప్రాధాన్యత ఇవ్వాలని ఇంటర్మీడియట్ కమీషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ జిల్లా ఇంటర్ విద్యా అధికారులు, ప్రిన్సిపాల్ లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

కళాశాల యూనిట్ గా ప్రిన్సిపాల్ లు ఏ సబ్జెక్టు టీచింగ్ సిబ్బంది అవసరమో వారిని గతంలో పని చేసిన గెస్ట్ అధ్యాపకులతో నియామకాలు జరపాలని, మిగిలిన ఖాళీలను నోటిఫికేషన్ ఇచ్చి నూతన అతిధి అధ్యాపకులతో పీజీ మార్కుల మెరిట్ ఆధారంగా నియామకాలు జరిపి సంబంధిత జిల్లా ఇంటర్ విద్యా అధికారులకు వివరాలు తెలియజేయాల్సి ఉంటుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

అలాగే అతిధి అధ్యాపకులుగా ఎంపిక కాబడిన అభ్యర్థులు కళాశాల పునఃప్రారంభం రోజును కళాశాల ప్రిన్సిపాల్ కు రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా 1145 సంఘము అధ్యక్షులు షేక్ యకూబ్ పాషా, కార్యదర్శి ఆర్. రాజ్ కుమార్ లు మాట్లాడుతూ ఈ నిర్ణయంతో ప్రభుత్వ కళాశాలలోని పేద విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించి ప్రభుత్వ కళాశాలల బలోపేతానికి కృషి చేస్తామని ప్రకటించారు.

ఈ సందర్భంగా అతిథి అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి సహకరిస్తున్న తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావ, విద్యాశాఖ మంత్రివర్యులు సబిత ఇంద్రారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి వర్యులు శ్రీ హరీష్ రావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంటర్ బోర్డ్ కమీషనర్, ఇంటర్ విద్యా జె.ఏ.సి చైర్మన్ డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి లకు మరియు ప్రిన్సిపాల్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులకు అతిథి అధ్యాపకులు అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు

Follow Us @