మెరుగుపడింది జీతాలే… జీవితాలు కాదు!…

  • సకాలంలో అందని వేతనాలు
  • 10 సంవత్సరాలుగా జరగని బదిలీలు
  • ఉద్యోగ, ఆరోగ్య భద్రత కరువు
  • 16 జీవో అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
  • వ్యాస కర్త :: Dr. తిరుపతి పోతరవేణి,

స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న దాదాపు 3658 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల జీతాల్లో మార్పులు వచ్చాయి గానీ వారి జీవితాలల్లో ఎలాంటి మార్పు రాలేదని చెప్పుకొని తీరాలి.

2014 ఎన్నికల్లో కెసిఆర్ మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పిన వాగ్దానం నేటికీ అలాగే ఉండిపోయింది. ఆ హామీ నెరవేరుతే అనేక సమస్యలకు పరిష్కారించబడి వారి జీవితాల్లో వెలుగులు నిండే అవకాశముండేది. ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరకపోయిన సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మానవత దృక్పధంతో పలు దఫాలుగా కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల వేతనాలు పెంచినారు. ఇదెంతో ఆహ్వానించదగిన విషయం. కానీ వేతనాలను అందించడంలో పూర్తి జాప్యం కొనసాగుతోంది. దీనివలన వేతనాల పెంపుదల సంబురం కంటే వేతనాల నిలుపుదల జాప్యమే కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లను నిరంతరం వేధిస్తుంది. ఫలితంగా కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల కుటుంబాల మనోభావాలను దెబ్బతింటున్నాయి. ఒకవైపు ప్రభుత్వం కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల వేతనాలకు సంబంధించిన బడ్జెట్ ను సకాలంలో రిలీజ్ చేసిన వారికి నిర్ణీత సమయంలో జీతాలు అందక పోవడానికి అధికారుల లీలలు ఎన్నో ఉన్నాయని చెప్పక తప్పదు.

ప్రభుత్వం కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల వేతనాలకు సంబంధించిన బడ్జెట్ ను సకాలంలో రిలీజ్ చేసిన వారికి నిర్ణీత సమయంలో జీతాలు అందక పోవడానికి అధికారుల లీలలు ఎన్నో ఉన్నాయని చెప్పక తప్పదు

ప్రతి కళాశాల ప్రిన్సిపాల్ కాంట్రాక్టు లెక్చరర్ల వేతనం బిల్లులను ప్రతి నెల 5వ తేదీ లోపు నోడల్ ఆఫీసుకు పంపితే, ప్రతి జిల్లా నోడల్ అధికారి 12వ తేదీ లోపు జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సమర్పించుతే వారికీ సకాలంలో వేతనాలు అందేది. వీరు వేతనాలపై ఉన్నత స్థాయి అధికారుల యొక్క అలసత్వమో, క్రింది స్థాయి అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ కాంట్రాక్టు లెక్చరర్లకు సంబంధించిన వేతనాలు అందక బడ్జెట్ లాప్స్ కావడం మనం గమనిస్తూనే ఉన్నాము. వీటికి తోడు గత కొన్ని నెలల నుండి TDS సమస్యకు అధికారులు పరిష్కారం చూపకపోవడం వలన గత ఆరు నెలల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ కాంట్రాక్టు జూనియర్ లెక్చరరుకు జీతం అందినా దాఖాలాలు లేవు. ఇది వారి దుర్భరమైన ఆర్థిక పరిస్థితికీ అద్దం పడుతుందనీ చెప్పవచ్చు.

ప్రస్తుతం కాలంలో కూడా గురువు స్థానంలో ఉన్న వీరిపై ప్రభుత్వం దర్జాగా వెట్టిచాకిరినీ కొనసాగిస్తుందనీ చెప్పవచ్చు.

కరోనా విపత్తులో కూడా కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు విధులు నిర్వహించడం వలన అనేక మంది కరోనా బారిన పడి ఆర్ధికంగా చితికి పోయినారు. కొందరు ప్రాణాలు కోల్పోపోవడం వలన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం, సంఘాలు ముందుకు రాకపోవడం శోచనీయం. రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే ఎటువంటి అలవెన్స్ వీరికి వర్తించవు. అనారోగ్యంతో బాధపడే క్షణాల్లో కూడ ఆరోగ్య భద్రత స్కీం వంటికి వీరికి వర్తించకపోవడం, విధి నిర్వహణలో చనిపోయిన వీరికి ఎలాంటి ఎక్స్ గ్రేషియా లేకపోవడం, రెగ్యులర్ ఉద్యోగులతో పోటీపడి విధినిర్వహణ చేస్తున్నప్పటికీ వీరికి అదనపు అలవెన్స్ లేక పోవడం, పైగా ఏదైనా పండుగ పబ్బానికి సెలవులు పెట్టుకునే విధంగా ఎక్కువ మొత్తంలో క్యాజువల్ లివ్స్ వెసులుబాటు లేకపోవడం, రోగమొస్తే మెడికల్ లీవ్ అవకాశం లేకపోవడం, ప్రస్తుతం కాలంలో కూడా గురువు స్థానంలో ఉన్న వీరిపై ప్రభుత్వం దర్జాగా వెట్టిచాకిరినీ కొనసాగిస్తుందనీ చెప్పవచ్చు. కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత లేని కారణంగా బానిసల వలె మానసిక హింసపడాల్సిన దుస్థితి నెలకొని ఉంది. ఒకవైపు అనేక కాలేజీ ఆఫీసుల్లో ఆఫీస్ సబర్డినేట్ మొదలు సీనియర్ అసిస్టెంట్ వరకు సంబందించిన అన్ని పనులు వీరే చక్కదిద్దుతూ, మరో వైపు భోధన చేయడం విద్యార్థుల ముందు చిన్న చూపుకు గురైవడం విచారకరంగా భావించవచ్చు.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ కోసం ఇచ్చిన జివో 16పై ఈ నెల 22తేదిన హైకోర్టు యందు జరిగే వాదనలకు ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని కాంట్రాక్టు ఉద్యోగ లోకం ప్రాధేయ పడుతున్నారు.

ఇకపోతే మహిళ కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మహిళా కాంట్రాక్టు అధ్యాపకులు పట్ల మాతృత్వ విషయంలో కూడ వివక్ష చూపుతున్నారు. రెగ్యులర్ మహిళా అధ్యాపకులకు జీతంతో కూడిన ఆరుమాసాల ప్రసూతి సెలవులైతే మహిళా కాంట్రాక్టు అధ్యాపకులకు మాత్రం ఎలాంటి వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు లేవు. వీలైతే బాలింతగానే విధులకు హాజరు కావాల్సిన దుస్థితి ఉన్నది. పైగా డెలివరీ సమయంలో ఎటువంటి భృతీ లభించే పరిస్థితి కూడ లేదు. కాంట్రాక్టు మహిళా అధ్యాపకులు దూర ప్రాంతాలలో పని చెయ్యడం వలన వారిపై పని ఒత్తిడి షరామాములుగానే ఉంటాయనేది కాదనలేని విషయంగా చెప్పవచ్చు. జూనియర్ కాలేజీ వ్యవస్థలో మాత్రమే గత 10 సంవత్సరాల నుండి కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు బదిలీలు లేకపోవడం వలన తల్లిదండ్రులు ఒకచోట, భార్య పిల్లలు మరోచోట ఉండే పరిస్థితి దాపురించింది. అలాగే వీరిలో కొందరు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడం వలన ప్రమాదలకు, అనారోగ్యంకు గురైతూ అసువులు బాస్తున్నారు. ఇక వీరి పిల్లలు విద్యాభ్యాసం విషయంలో స్థానికతను కొల్పుతూ, నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నాము అనే మనోవేదనలో ఉన్నారు.

కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల వెట్టిచాకిరీని తొలగించి, ఇతర ఉద్యోగులకు వలే వీరికీ కనీస హక్కులను కల్పించడంపై ప్రభుత్వ పెద్దలు, అధికారులు, రెగ్యులర్ ఉద్యోగ సంఘ నాయకులు యోచించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉన్నది.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు మెరుగుపడింది జీతాలే తప్ప జీవితాలు కావనేది చాలా స్పష్టంగా కన్పి స్తున్న యధార్ధం. ముఖ్యంగా వీరికి జీతాల విషయంలో, మానవీయ కోణంలో ప్రభుత్వం యోచించి ప్రతి నెల మొదటి వారంలో వచ్చేలా చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉంది. అలాగే కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల వెట్టిచాకిరీని తొలగించి, ఇతర ఉద్యోగులకు వలే వీరికీ కనీస హక్కులను కల్పించడంపై ప్రభుత్వ పెద్దలు, అధికారులు, రెగ్యులర్ ఉద్యోగ సంఘ నాయకులు యోచించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉన్నది. అదేవిదంగా గతంలో తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ కోసం ఇచ్చిన జివో 16పై ఈ నెల 22తేదిన హైకోర్టు యందు జరిగే వాదనలకు ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని కాంట్రాక్టు ఉద్యోగ లోకం ప్రాధేయ పడుతున్నారు.

జూనియర్ కాలేజీ వ్యవస్థలో మాత్రమే గత 10 సంవత్సరాల నుండి కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు బదిలీలు లేకపోవడం వలన తల్లిదండ్రులు ఒకచోట, భార్య పిల్లలు మరోచోట ఉండే పరిస్థితి దాపురించింది.

Follow Us @