కాంట్రాక్టు అధ్యాపకుల సంక్షేమమే కెసిఆర్ ధ్యేయం – వ్యాసకర్త – డా. తిరుపతి పోతరవేని

తెలంగాణ స్వరాష్ట్రం సిద్దించి కేసీఆర్ అధికారం చేపట్టిన నాటి నుండి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ మరియు పాలిటెక్నిక్ కళాశాలలు పురోగమన దిశలో నడుస్తున్నవి. ఈ కళాశాలల పురోగమనంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు జూనియర్, డిగ్రీ మరియు పాలిటెక్నిక్ లెక్చరర్ల కృషి ప్రశంసనీయమైనదిగా చెప్పవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా గల ప్రభుత్వ జూనియర్, డిగ్రీ మరియు పాలిటెక్నిక్ కళాశాలలో దాదాపు 6000 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరు దాదాపు 20 ఏండ్ల నుండి తమ బ్రతుకుకు, హోదాకు, భద్రతకు కారణమైన ఉన్నత విద్యావ్యవస్థ పరిరక్షణకు అహర్నిశలు కృషి చేస్తున్నారు.

ఉన్నత విద్యకు కేసీఆర్ ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను మరియు కోవిడ్ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు వంటి మొదలైన ప్రోత్సహలను గ్రామ గ్రామంకు తీసుకవెళుతున్నారు. వీరు ఉన్నత విద్య వ్యవస్థ ప్రతిష్టను పెంపొందించడంలో ముందుంటున్నారు. అలాగే ప్రభుత్వ జూనియర్, డిగ్రీ మరియు పాలిటెక్నిక్ కళాశాలలో చదివే బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, ప్రయివేట్, కార్పొరేటు కళాశాలకు దీటుగా ఫలితాలను తీసుకవస్తున్నారు. వీరు గ్రామీణ నిరుపేద విద్యార్థులకు తమ జీతం నుండి కొంత ఆర్ధిక సహాయం చేస్తు, పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే విద్యార్థులకు మార్గనిర్దేశకత్వం చేస్తున్నారు. వీరు ప్రతి సంవత్సరం అడ్మిషన్స్ డ్రైవ్ లో చురుకుగా పాల్గొని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వం ఉన్నత విద్యకై అందించే సౌకర్యాల గురించి అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ మరియు పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల సంఖ్యను గణనీయంగా పెంచుతున్నారు.

విద్యార్థుల ప్రవేశాల నుండి పరీక్షల ఫలితాల వరకు కాంట్రాక్టు అధ్యాపకులు నిరంతరం శ్రమిస్తు, ప్రభుత్వ కళాశాలల పరిరక్షణకు కృషి చేస్తున్నారు.

గత ఉమ్మడి ప్రభుత్వం కాంట్రాక్టు జూనియర్, డిగ్రీ మరియు పాలిటెక్నిక్ అధ్యాపకులకు చాలీ చాలనీ జీతాలు ఇస్తూ శ్రమ దోపిడీకి గురి చేశారు. వారి ఉద్యోగ భద్రతకు భరోసా ఇవ్వలేదు. కాంట్రాక్టు జూనియర్, డిగ్రీ మరియు పాలిటెక్నిక్ అధ్యాపక సంఘాలు సమ్మెలు, ధర్నాలు చేసినా పెద్దగా పట్టించుకోలేదు. కాబట్టి వారి సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు ఉండేవి. ఈ తరుణంలో కెసిఆర్ నాయకత్వంలో జరిగినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కాంట్రాక్టు జూనియర్, డిగ్రీ మరియు పాలిటెక్నిక్ అధ్యాపకులు అండగా నిలుస్తూ, ఒకవైపు పరోక్షంగా ఉద్యమంలో పాల్గొంటు మరోవైపు పరోక్షంగా విద్యార్థుల ద్వారా ఉద్యమం ఉదృతం చేశారు. అలాగే స్వరాష్ట్ర సిద్దించిన జరిగిన తొలి సాధారణ ఎన్నికల హామీలో భాగంగా తెరాస పార్టీ అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కెసిఆర్ హమీ ఇచ్చారు. తమ మేనిపేస్టోలో పేర్కొన్న హామీని నిలబెట్టుకోనుటకు కేసీఆర్ అధికారం చేపట్టిన తొలియేడు(2014) కాంట్రాక్టు జూనియర్, డిగ్రీ మరియు పాలిటెక్నిక్ అధ్యాపకుల క్రమబద్దీకరణకై జి.వో.16ను జారీ చేయగా విపక్ష పార్టీల ద్వంద వైఖరి వలన కోర్టులో 16 వ జి.వో కు అడ్డంకులు ఏర్పడ్డాయి.

2017లో కెసిఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం అనే తీర్పుకు అనుగుణంగా కాంట్రాక్టు జూనియర్, డిగ్రీ మరియు పాలిటెక్నిక్ లెక్చరర్లకు రెగ్యులర్ ఉద్యోగులకు సమానమైన వేతనం అమలు చేసింది. ఇదే ప్రభుత్వం 2018లో రెండవ దపా ఎన్నికలకు వెళ్లే ముందు శ్రీ

తన్నీరు హరీష్ రావు చొరవతో కాంట్రాక్టు జూనియర్, డిగ్రీ మరియు పాలిటెక్నిక్ లెక్చరర్లకు 12 నెలల వేతన సదుపాయం కల్పించింది.

కేసీఆర్ ప్రభుత్వం భావించిన విధంగా జీవో 16 ప్రకారం కాంట్రాక్టు జూనియర్, డిగ్రీ మరియు పాలిటెక్నిక్ లెక్చరర్ల క్రమబద్దీకరణ జరిగినట్లయితే అనేక సమస్యలు పరిష్కారం అయ్యేవి. ఈ జీవోకు వ్యతిరేకంగా కొందరు నిరుద్యోగులు కోర్టుకు వెళ్లడంతో, కోర్టు స్టే ఇవ్వడం దీనితో క్రమబద్దీకరణ నిలిచి పోవడం జరిగింది. అప్పటి నుండి కెసిఆర్ ప్రభుత్వం జీవోకు ఉన్న అడ్డంకులు తొలిగించుటకు ప్రయత్నాలు చేస్తూనే కెసిఆర్ ప్రభుత్వం కాంట్రాక్టు జూనియర్, డిగ్రీ మరియు పాలిటెక్నిక్ అధ్యాపకుల సంక్షేమమే ధ్యేయంగా శ్రద్ద చూపుతూనే ఉంది.

2021 మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎం కెసిఆర్ పిఆర్ సి ప్రకటన చేసే సందర్బంలో మాట్లాడుతూ దేశంలో తొలి సారిగా పిఆర్ సి ని రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ వంటి ఉద్యోగులకు వర్తింపచేస్తామని చారిత్రాత్మకమైన నిర్ణయం ప్రకటించినారు.

ఈ నిర్ణయం అమలులో భాగంగా ఈ నెల 17 వ తేదిన ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు చొరవతో విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, జూనియర్, పాలిటెక్నిక్ కళాశా లల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు కొత్త పీఆర్సీ ప్రకారం మూల వేతనంకు (బేసిక్ పే) సంబందించిన జీవో 104,105,106 లను జారీ చేశారు. తాజా ఉత్తర్వుల మేరకు జూనియర్ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న సుమారు 3600 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు గతంలో నెలకు రూ.37,100 ఉన్న వేతనం నుంచి రూ. 54,220కు పెరిగింది. డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న సుమారు 850 మంది గతంలో నెలకు రూ. 40,270 ఉన్న వేతనం నుంచి రూ.58,850కి పెరిగింది. పాలిటెక్నిక్ కాలేజీల్లోని 450 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనం రూ.40,270 ఉన్న వేతనం నుంచి రూ.58,850కు పెరగడం వలన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 6000 కాంట్రాక్టు అధ్యాపకుల కుటుంబాలకు ఆర్ధికంగా మేలు జరుగుతుంది. అలాగే కాంట్రాక్టు అధ్యాపకులు మరింత ఉత్సాహంతో పని చేస్తూ ప్రభుత్వ కళాశాలలో చదివే బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ఉన్నత విద్యకు మరింత వన్నెను తీసుక వస్తారు అనడంలో సందేహం లేదు.

అదేవిధంగా కెసిఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ జూనియర్, డిగ్రీ మరియు పాలిటెక్నిక్ కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తూ బంగారు తెలంగాణ పునర్మిణంకు తమ వంతు కృషి చేస్తారని చెప్పవచ్చు. ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాల ద్వారా సబ్బండ వర్ణాలకు న్యాయం చేస్తున్న కేసీఆర్ కాంట్రాక్టు లెక్చరర్లకు కూడ న్యాయం చేస్తున్నారు అని తెలంగాణ సమాజం భావిస్తుంది. కెసిఆర్ ప్రభుత్వం భవిష్యత్ లో కూడా కాంట్రాక్టు జూనియర్, డిగ్రీ మరియు పాలిటెక్నిక్ లెక్చరర్లకు సంబందించిన ఆర్థిక భారం లేని సమస్యలను ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యయైన బదిలీలను వీలైనంత త్వరగా పరిష్కారించాలని, అలాగే మహిళా అధ్యాపకులకు ప్రసూతి సెలవులు ఇవ్వాలని కాంట్రాక్టు అధ్యాపకులు కోరుకుంటున్నారు.

డా. తిరుపతి పోతరవేని, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం,711, జగిత్యాల
9963117456.

Follow Us @