ఇంటర్ ఆపై చదివే బీసీ విద్యార్థులకు హస్టల్ వసతి

హైదరాబాద్ (జూలై – 28) : పోస్ట్ మెట్రిక్ (కళాశాల) స్థాయి బీసీ విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.

రాష్ట్రంలో ఇంటర్, డిగ్రీ, పీజీ చదివే 33,687 మంది బీసీ విద్యార్థులకు లబ్ధిచేకూర్చే ఈ పథకానికి ఏటా ప్రభుత్వం సుమారు రూ.12 కోట్లు అదనంగా వెచ్చిస్తుందని తెలిపారు. ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా 64,419 మంది ఉన్నారని.. వీరి కోసం ఇప్పటికే ఏటా రూ.334 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి వివరించారు.

కళాశాల స్థాయి వసతి గృహాల్లోని విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్లాంకెట్లు, బెడ్ షీట్లు ఇతర సామగ్రిని అందిస్తామని.. కాస్మొటిక్ ఛార్జీలు ఒక్కొక్కరికి రూ.140 చెల్లిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో హైదరాబాద్ లో ఈ నెల 28న బీసీ మంత్రులు, బీసీ సంఘం నాయకుల సమక్షంలో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. దీనికి కేసీఆర్ విద్యా కానుక సహా పలు పేర్లు పరిశీలిస్తున్నామన్నారు.