• అసలు.. నకిలీదో తెలిపే వెబ్సైట్.. 15 వర్సిటీల 20 ఏండ్ల డాటా రెడీ
• వారంలో అందుబాటులోకి తేనున్న ఉన్నత విద్యామండలి పోర్టల్
హైదరాబాద్, (ఆగస్టు 26) : రోజురోజుకు ఆందోళన కలిగిస్తున్న ఫేక్ సర్టిఫికెట్లను సులభంగా గుర్తించేందుకు ఉన్నత విద్యామండలి రూపొందించిన వెబ్సైట్ త్వరలోనే అందుబాటులోకి రానున్నది. అధికారిక సమాచారం ప్రకారం వారం పది రోజుల్లో వెబ్ పోర్టల్ సేవలు అందించనున్నది. ఈ నెల 18న వెబ్సైట్ ను ప్రారంభించాలని నిర్ణయించినా.. డీజీపీ మహేందర్రెడ్డి సెలవులో ఉండటంతో వాయిదా వేశారు. ఇటీవలికాలంలో ఫేక్ సర్టిఫికెట్లు భారీగా బయటపడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల కోసం పలువురు నకిలీ సర్టిఫికెట్లను సమర్పిస్తున్నారు. యూనివర్సిటీలు లోగోలు, వాటర్మార్క్, దృఢమైన పేపర్ల వినియోగం వంటి సెక్యూరిటీ ఫీచర్లను వినియోగిస్తున్నాయి. యూనిక్ కోడ్ నంబర్లను సైతం కేటాయిస్తున్నాయి. అయినా ఫేక్ సర్టిఫికెట్ల దందా ఆగడం లేదు. ఆయా సర్టిఫికెట్ల పరిశీలన చేపడుతున్నా కొన్నిసార్లు గుర్తుపట్టలేనంత జాగ్రత్తగా సర్టిఫికెట్లు తయారుచేస్తున్నారు. ఇంకొన్నిసార్లు వర్సిటీలు స్పందించకపోవడం, చొరవ చూపకపోవడంతో పరిశీలన ఆలస్యమవుతున్నది. ఈ నేపథ్యంలో ఒకే ఒక్క క్లిక్ తో ఆన్లైన్లో సర్టిఫికెట్లన్నింటినీ పరిశీలించేలా ఉన్నత విద్యామండలి అధికారులు సరికొత్త వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
15 వర్సిటీల్లోని విద్యార్థుల సర్టిఫికెట్లన్నింటినీ ఒకే సర్వర్ లో పొందుపరిచారు. అభ్యర్థుల హాల్టికెట్ నంబర్లను ఎంటర్ చేస్తే సర్టిఫికెట్ అసలుదో.. నకిలీదో తెలుసుకునేలా ఏర్పాట్లుచేశారు. ఇటీవలికాలంలో విదేశీ వర్సిటీలు, కంపెనీలు ఎక్కువగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం వర్సిటీలకు దరఖాస్తు చేస్తున్నాయి. అవి దరఖాస్తు చేయడం, వర్సిటీలు వెరిఫికేషన్ చేయడం, లేఖ ద్వారా వర్సిటీలు సమాచారం పంపడం జరుగు మతున్నది. ఈ వెబ్సైట్ అందుబాటులోకి వస్తే సులభతరమవుతుంది.
ప్రత్యేకతలు..
20 ఏండ్లుగా యూనివర్సిటీల్లో పాసైన, పట్టాలు పొందిన విద్యార్థులందరి సర్టిఫికెట్లను వెబ్సైట్లో ఉంచుతారు. విద్యార్థుల పేర్లు, హాల్టికెట్ నంబర్లను ఇదే వెబ్సైట్లో పొందుపరుస్తారు. డిగ్రీ, పీజీ, పీహెచ్డీ పూర్తిచేసినవారి వివరాలతో కూడిన డాటాబేస్ ను నిర్వహిస్తారు.
• దీనిని కేంద్రం తీసుకొచ్చిన డిజిలాకర్ తో అనుసంధానిస్తారు. అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లు శాశ్వతంగా అలాగే ఉంటాయి. .
• సర్టిఫికెట్ల పరిశీలనకు ప్రభుత్వ శాఖలు, పోలీసులు లేదా ప్రైవేట్ సంస్థలు ముందుగా తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులను సంప్రదించాలి వారికి ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. ప్రభుత్వ ఏజెన్సీలు సులభంగా పరిశీలించుకోవచ్చు.
• విదేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులు సైతం ఈ డిజిలాకర్ ఆధారంగా వెరిఫికేషన్ చేయించుకోవచ్చు.
• పరిశీలనలో సర్టిఫికెట్ ఫేక్ అని తేలితే అక్కడి నుంచి పోలీసులకు ఫిర్యాదు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ntnews
Follow Us @