పాలిటెక్నిక్ ఫస్టియర్ తర్వాత ఇంటర్ సెకండీయర్

హైదరాబాద్ (డిసెంబర్ 03) : తెలంగాణలో పాలిటెక్నిక్ కోర్సుల విద్యార్థులకు మల్టిపుల్ ఎగ్జిట్ అవకాశం కల్పించాలని తెలంగాణ సాంకేతిక విద్యామండలి అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. పాలిటెక్నిక్ ను మధ్యలో వదిలేసిన వారికి ఇంటర్ తో సమాన సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు అనుమతి కోరుతూ ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ కు ప్రతిపాదనలు పంపించారు. ఆమోదిస్తే విద్యార్థులకు ఈ వెసులుబాటు లభించనున్నది.

విద్యార్థులు వివిధ కారణాలతో పాలిటెక్నిక్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం తర్వాత కోర్సు వదిలేసే అవకాశం కల్పించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

ఎగ్జిట్ విధానం అమలులో భాగంగా ఈ విద్యా సంవత్సరం సెకండియర్ పూర్తిచేసిన వారికి డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు అవకాశం కల్పించారు. తాజాగా పాలిటెక్నిక్ ఫస్టియర్ లో ఎగ్జిట్ అయిన వారికి ఇంటర్ సెకండియర్ లో ప్రవేశం కల్పించే అంశం పరిశీలనలో ఉన్నది.

★ నూతన సర్టిఫికెట్ విధానం :

  • పాలిటెక్నిక్ ఫస్టియర్ పూర్తిచేసి కోర్సును వదిలేసినా.. నిర్దిష్ట క్రెడిట్స్ సాధించినా ఆయా విద్యార్థికి ఇంటర్ ఫస్టియర్ తో సమానమైన సర్టిఫికెట్ ఇస్తారు. ఈ సర్టిఫికెట్ తో ఇంటర్ సెకండియర్ లో చేరవచ్చు.
  • పాలిటెక్నిక్ సెకండియర్ పూర్తిచేసి మధ్యలో నిష్క్రమించినా, మూడేండ్ల కోర్సులో ఫెయిలై నిర్దిష్ట క్రెడిట్స్ 90 సాధిస్తే ఆ విద్యార్థికి సర్జిఫికెట్ ఇన్ ఇంజినీరింగ్ ఈ విద్యాసంవత్సరం నుంచి జారీచేస్తున్నారు. వీరు బీఏ, బీఎస్సీ. బీకాం కోర్సుల్లో చేరేందుకు అవకాశం కల్పించారు.
  • ప్రస్తుతానికి 150 క్రెడిట్స్ కు గాను 130 క్రెడిట్స్ సాధిస్తే పాలిటెక్నిక్ పూర్తిచేసినట్టు లెక్క. ఇలాంటి వారికి డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ సర్టిఫికెట్ ను అందజేస్తున్నారు.