- నాలుగు సంవత్సరాల డిగ్రీలో 7.5 జీపీఏ సాధిస్తేనే అడ్మిషన్
- మార్గదర్శకాలను సిద్ధం చేసిన యూజీసీ
- ఈ విద్యాసంవత్సరం నుంచి అమలు
ఇంటర్.. డిగ్రీ.. పీజీ.. పీహెచ్‌డీ ఇది ఇంతకాలంగా నడుస్తున్న కోర్సుల వరుసక్రమం. కానీ ఇప్పుడు నాలుగేండ్ల డిగ్రీ తర్వాత పీజీ చదవకుండానే పీహెచ్‌డీలో చేరే అవకాశం త్వరలో అందుబాటులోకి రానున్నది. అయితే అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులు నాలుగేండ్ల డిగ్రీలో 10 జీపీఏకు గాను 7.5 సీజీపీఏ సాధించాల్సి ఉంటుంది.
పీహెచ్‌డీ ప్రవేశాల కోసం మినిమం స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్ ఫర్ అవార్డ్ ఆఫ్ పీహెచ్‌డీ డిగ్రీ రెగ్యులేషన్స్-2022 పేరుతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేసింది. ఈ మార్గదర్శకాలు త్వరలోనే విడుదల చేయనున్నట్టు యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్‌కుమార్ తెలిపారు. 2022 -23 విద్యాసంవత్సరంలో ప్రవేశాలు ఉంటాయని చెప్పారు.
అమలు ఇలా..
నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా నాలుగేండ్లల్లో 8 సెమిస్టర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని అందజేస్తున్నారు. ఈ డిగ్రీలో 10 సీజీపీఏకు 7.5 సీజీపీఏ సాధించిన వారికి నేరుగా పీహెచ్‌డీ సీట్లు కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వికలాంగులకు 0.5 సీజీపీఏ మినహాయింపు ఉంటుంది.
7.5 సీజీపీఏ కంటే తక్కువగా పొందిన వారు ఏడాది వ్యవధి గల మాస్టర్స్ డిగ్రీని పూర్తిచేసే సరిపోతుంది.
40 శాతం సీట్లను యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశపరీక్ష ఆధారంగా భర్తీ చేయనుండగా, 60 శాతం సీట్లను నేషనల్ లెవల్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా భర్తీచేస్తారు.
నేషనల్ లెవల్ సీట్ల భర్తీలో భాగంగా యూజీసీ నెట్, సీఎస్‌ఐఆర్, ఐసీఎంఆర్, ఐసీఏఆర్ తదితర పరీక్షల్లో సాధించిన ప్రతిభ ద్వారా భర్తీచేస్తారు.
Source : ntnews
Follow Us @