BIKKI NEWS (DEC. 25) : మొక్కల పెరుగుదలకు దోహదపడే ఒక కొత్త రకం బ్యాక్టీరియాను పశ్చిమ బెంగాల్ కు చెందిన విశ్వభారతి యూనివర్సిటీకి చెందిన బోటనీ విభాగం కనుగొంది. దీనికి రవీంద్రనాథ్ ఠాగుర్ కు గుర్తుగా “పాంటోయీ టాగోరీ” (Pantoe Tagori Bacteria) అనే పేరును పెట్టింది.
‘ఈ బ్యాక్టీరియా ఉనికి వ్యవసాయంలో కీలక మలుపునకు కారణమవుతుంది. ముఖ్యంగా వరి, బఠానీ, మిరప పంటల సాగులో ఇది పూర్తి సామర్ధ్యాన్ని కనబరిచింది’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ బోంబా దాం తెలిపారు.
పాంటోయీ టాగోరీ బ్యాక్టీరియా మట్టి నుంచి పొటాషియంను వేరు చేస్తుందని.. ఇది మొక్క ఎదగడానికి మంచి మూలకంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. జార్ఖండ్ లోని ఝరియా బొగ్గు గనుల్లో దీనిని కనుగొన్నామన్నారు. పొటాషియం, ఫాస్ఫరస్ మూలకాలను శోషించుకోవడం ద్వారా మట్టిలోని నత్రజని స్థాయులను నియంత్రిస్తోందని వివరించారు. ‘కచ్చితంగా ఇది తనదైన ప్రత్యేక లక్షణాలున్న ఓ జీవి. వ్యవ సాయంలో రసాయన పురుగుమందుల వాడకాన్ని ఈ బ్యాక్టీరియా తగ్గించగలదు. రైతులకు పెట్టుబడి ఖర్చూ తగ్గుతుంది. దిగుబడీ పెరుగుతుంది’ అని దాం పేర్కొన్నారు. తమ పరిశోధనను అసోసియేషన్ ఆఫ్ మైక్రో బయాలజిస్ట్స్ ఆఫ్ ఇండియా (ఏఎంఐ) గుర్తించిందని ఆయన వెల్లడించారు.