BIKKI NEWS (DEC. 14) : ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం (Old Pension Scheme RBI Review) వల్ల రాష్ట్రాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని రిజర్వు బ్యాంకు హెచ్చరించింది. డీఏతో అనుసంధానమైన ఓపీఎస్ వల్ల రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుందని, ఫలితంగా అభివృద్ధి కార్యక్రమాలకు చేసే వ్యయం తగ్గిపోతుందని ఆర్బీఐ నివేదిక పేర్కొంది.
‘రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి: 2023- 24 బడ్జెట్లపై అధ్యయనం’ పేరిట ఆర్బీఐ మంగళవారం ఒక నివేదికను విడుదల చేసింది. వస్తు సేవలు, సబ్సిడీలు, నగదు బదిలీలు, గ్యారంటీలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని ప్రమాదంలోకి నెట్టుతాయని ఆ నివేదిక తెలిపింది.
ప్రభుత్వ ఉద్యోగులకు పాత పద్ధతిలో Pension ఓపీఎస్ ను అమలు చేయనున్నామని ఇటీవల కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి, భవిష్య నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (PSEDA)కు సమాచారమిచ్చాయి.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఎన్నికల హామీగా ఓపీఎస్ ను వర్తింపజేస్తామని పేర్కొన్నది. ఈ
నిర్ణయం వల్ల ఆ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడుతుందని, పురోగతికి ఊతమిచ్చే ప్రాజెక్టులపై పెట్టుబడి వ్యయం తగ్గిపోతుందని ఆ నివేదిక పేర్కొంది. ఓపీఎస్ కు మారడం తిరోగమన చర్య దేశంలోని అన్ని రాష్ట్రాలు జాతీయ పెన్షన్ పథకం (ఎన్పీఎస్) నుంచి ఓపీఎస్ కు మారి పోతే.. సంచిత ఆర్థిక భారం ఎన్పీఎస్ కన్నా 4.5 రెట్లు అధికంగా ఉండవచ్చునని, దీనికి తోడు 2060 నాటికి జీడీపీలో ఇది వార్షికంగా 0.9 శాతం అదనపు భారం అవుతుందని అంతర్గతంగా అంచనా వేసినట్టు ఆ నివేదిక వెల్లడించింది. ఇప్పటికే ఓపీఎస్కు అర్హులైన ఉద్యోగులు 2040 నాటికి పదవీ విరమణ పొందుతారని, వారు కనీసం 2060 వరకు పెన్షన్ పొందుతారని, ఈ భారం కూడా రాష్ట్రాలపై ఉంటుందన్నది గమనంలో ఉంచుకోవాలని పేర్కొంది.
రాష్ట్రాలు ఓపీఎస్ కు మారడం తిరోగమన చర్య అని, భవిష్యత్తు తరాలప్రయోజనాలను పణంగా పెట్టడమేనని అభిప్రాయపడింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల ఆర్థిక లోటు జీఎస్టీపీలో నాలుగు శాతాన్ని మించిపోయిందని, ఇది దేశ సగటు 3.1 శాతం కన్నా ఎక్కువ అని తెలిపింది. ఆ రాష్ట్రాల అప్పులు వాటి జీఎస్టీపీలో 35 శాతాన్ని మించిపోయాయని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో సబ్సిడీలు, నగదు బదిలీలు, గ్యారంటీలు అమలు చేస్తే వాటి ఆర్థిక పరిస్థితి మరింత పతనం అవుతుందని, గత రెండేండ్లలో సాధించిన ఆర్థిక స్థిరత్వం కుప్పకూలుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.