- నూతన పథకానికి రూపకల్పన చేసిన కేసీఆర్
- పది రోజుల్లో ప్రారంభించనున్న కేసీఆర్
హైదరాబాద్ (డిసెంబర్ – 03) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మాతాశిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా గర్భిణులకు “కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు” అందజేయనున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు.
ఈ కిట్ లో కేజీ న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, కేజీ ఖర్జూర, 3 బాటిళ్ల ఐరన్ సిరప్, అరకేజీ నెయ్యి, అల్బెండజోల్ మాత్రలు ఉంటాయి. గర్భం దాల్చిన 3, 6 ఆరు నెలలకు రెండుసార్లు అందజేస్తారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఇది పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. 10 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.
బిడ్డ కడుపులో పడ్డప్పుడు న్యూట్రీషన్ కిట్, డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ కిట్ ద్వారా మాతశిశు మరణాలు తగ్గించడమే ధ్యేయమని తెలిపారు. కేసీఆర్ కిట్ విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడంతో ఇదే స్ఫూర్తితో మహిళల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ గారు న్యూట్రీషన్ కిట్ తీసుకురాబోతున్నారని తెలిపారు.
అత్యధికంగా ఎనీమియా ప్రభావం ఉన్న 9 జిల్లాలు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ లలో ఈ కిట్ ప్రవేశ పెట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ లను పోషకాహారం ద్వారా అందించి రక్త హీనత తగ్గించడం, హీమోగ్లోబిన్ శాతం పెంచడం దీని లక్ష్యం.