కాంట్రాక్టు లెక్చరర్ ల బదిలీలపై చిగురిస్తున్న ఆశలు – నూనె శ్రీనివాస్

2020 నవంబర్ 15న విద్యాశాఖపై నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ లకు బదిలీలు జరిపించండి అని స్పష్టమైన ఆదేశాలను విద్యాశాఖ అధికారులకు ఇచ్చి 7 నెలలు గడుస్తున్నా ఇంతవరకు బదిలీలు జరగకపోవడం శోచనీయమని బదిలీ బాధితులు వాపోతున్నారు.

ఈ నేపథ్యంలో కాంట్రాక్టు అధ్యాపకుల సంఘాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బదిలీలపై పైలు మాత్రం ఒక్క ఇంచ్ కూడా కదలకపోవడంతో బదిలీ బాధితులు నిరాశ నిస్పృహలో ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ బదిలీలు జరపమని ఆదేశాలు ఇచ్చి ఏడు నెలలు దాటుతున్నా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవవడం అధికారుల నిర్లక్ష్యమని బాధితులు ఆవేదన చెందుతున్నారు.

తాజాగా సిద్దిపేట వేదికగా కాంట్రాక్టు అధ్యాపకుల జేఏసీ నిర్వహించిన “సీఎం కేసీఆర్ కు కృతజ్ఞత సభ” లో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ ల ప్రధాన ఏకైక సమస్యగా బదిలీలను మాత్రమే తీసుకువెళ్ళడం గమనార్హం. దీనిపై మంత్రి స్పందిస్తూ బదిలీలపై ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లతో మాట్లాడి బదిలీలు జరిపిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో మరోసారి చర్చ జోరుగా సాగుతోంది

తాజా సమాచారం ప్రకారం కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ ల బదిలీలపై ఆశలు చిగురిస్తున్నాయి.సిద్దిపేట సభ తర్వాత కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ లలో కొంత ఆశలు చిగురిస్తున్నాయి. త్వరలోనే బదిలీలు జరుగుతాయని బదిలీ భాధితులు ఆశిస్తున్నారు. బదిలీలకు సంబంధించి తీవ్రమైన ప్రయత్నాలు కొనసాగుతున్నట్టు సమాచారం. ఏదిఏమైనా ఈ నెలాఖరులోపు బదిలీల మార్గదర్శకాలు విడుదలవుతాయని సమాచారం.

బదిలీలకు సంభందించిన ఫైల్ కు ముఖ్యమంత్రి కూడా కేబినెట్ లో చర్చించి అనుమతినిచ్చినట్టు విశ్వసనీయవర్గాల భోగట్టా. ఈ ఏడాది బదిలీలు జరగకపోతే కొత్త జోనల్ ఏర్పడినందున భవిష్యత్తులో కాంట్రాక్ట్ లెక్చరర్ లకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం త్వరలోనే 900 జూనియర్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేసే ఆలోచనలో ఉంది. కావున కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ లకు ఖాళీలు దొరకడం ఇబ్బందవుతుంది. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ లకు బదిలీలు ఖచ్చితంగా జరగాలని బదిలీ భాధితులు కోరుకుందాం…

Follow Us @