Home > JOBS > GURUKULA JOBS > గురుకుల పీడీ జాబితాలో అనర్హులు!

గురుకుల పీడీ జాబితాలో అనర్హులు!

BIKKI NEWS (MARCH 09): రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గురుకులాల్లో ఖాళీలను గురుకుల నియమాక బోర్డు (TREIRB) ఇటీవల భర్తీ చేసింది. వాటిలో స్కూల్‌ పీడీ (ఫిజికల్‌ డైరెక్టర్‌) పోస్టులకు నోటిఫికేషన్‌ ప్రకారం 2023 ఏప్రిల్‌ 5 నాటికి పీడీ పోస్టుల అర్హతకు సంబంధించిన అన్ని పరీక్షలు ఉత్తీర్ణులైన అభ్యర్థులే అర్హులుగా ప్రకటించింది. దానిప్రకారం గత మే నెల నాటికే అభ్యర్థులు ఆయా విద్యార్హతలను సాధించి ఉండాలి. కానీ ప్రస్తుతం ట్రిబ్‌ మాత్రం నోటిఫికేషన్‌కు విరుద్ధంగా గత నవంబర్‌లో ఉత్తీర్ణులైన ఇద్దరు అభ్యర్థులను పీడీ పోస్టులకు ఎంపిక చేసింది. 2302069885, 2302070434 హాల్‌టికెట్‌ నంబర్లు కలిగిన వారిని అనర్హులుగా (NON QUALIFIERS IN GURUKULA SCHOOL P.D. POSTS) గుర్తించారు. నోటిఫికేషన్‌ సమయానికి వారిద్దరూ బీపీఎడ్‌ ఉత్తీర్ణులు కాలేదు. ట్రిబ్‌ మాత్రం పోస్టింగ్‌ ఇచ్చింది.

దీనిపై పలువురు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఇటీవల కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ ఇద్దరికీ పోస్టింగ్‌లు ఇవ్వడంలేదని, జాబితాలో నుంచి తొలగించామని ట్రిబ్‌ కోర్టు ఎదుట ప్రకటించింది.

★ కేటగిరీల వారీగా, జోన్‌ల వారీగా కటాఫ్ మార్కులు ప్రకటించాలి.

క్యాటగిరీల వారీగా కటాఫ్‌ మార్కులను, జోన్‌ వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తే ఇంకా అనేక అవకతవకలు బయటపడతాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రిబ్‌ ఆయా జాబితాలను ఇప్పటికీ వెల్లడించడం లేదని విమర్శిస్తున్నారు. అంతేకాదు సొసైటీల వారీగానే కాకుండా, జోన్ల వారీగా చూసుకున్నా నాన్‌లోకల్‌ అభ్యర్థులకు ఒక్క పీడీ పోస్టు కూడా దక్కదని కానీ, ఏకంగా ముగ్గురు నాన్‌లోకల్‌ అభ్యర్థులకు ట్రిబ్‌ పోస్టింగ్‌లు ఇచ్చిందని కూడా అభ్యర్థులు ఆరోపిస్తూ కోర్టుకెక్కారు.

★ ఇద్దరు పీడీ అభ్యర్థులకు అన్యాయం

ఒకవైపు రీలిక్విష్‌మెంట్‌ లేదన్న ట్రిబ్‌ మరోవైపు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ను సజావుగా నిర్వహించని కారణంగా ఇద్దరు పీడీ అభ్యర్థులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. 1:2 జాబితాను విడుదల చేసి తుది జాబితాను ప్రకటించింది. అందులో ఇద్దరు అనర్హులు ఉన్నారని గుర్తించి పక్కన పెట్టామని ట్రిబ్‌ స్వయంగా ప్రకటించింది. అయితే రీలిక్విష్‌మెంట్‌ ఉన్నట్టయితే 1:2 జాబితాలోని తదుపరి అభ్యర్థులకు ఆ పోస్టులు దక్కేవి. కానీ ట్రిబ్‌ మాత్రం రీలిక్విష్‌మెంట్‌ లేదని తేల్చిచెప్పింది. దీంతో ఆ రెండు పోస్టులు మళ్లీ బ్యాక్‌లాగ్‌లో పడుతుండగా, ఇద్దరు అభ్యర్థులు నష్టపోయారు

★ నిబంధనల మేరకే నియామకాలు: ట్రిబ్‌

గురుకుల ఉపాధ్యాయుల నియామకాల్లో ప్రభుత్వ నిబంధనల మేరకే నియామకాలు చేపట్టామని ట్రిబ్‌ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష విధానంలో అవకతవకలకు తావులేకుండా పకడ్బందీగా సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించినట్టు తెలిపింది. 2018లో గత ప్రభుత్వం రిలింక్విష్‌మెంట్‌ పద్ధతిని తొలగించిందని పేర్కొన్నది. కోర్టు కేసులను పరిష్కరించి, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఫలితాలను ప్రకటించి చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని అధికారులు స్పష్టం చేశారు. దివ్యాంగులకు అనువైన తేదీల్లోనే మెడికల్‌ వెరిఫికేషన్‌ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఏ ఒక పోస్టు కూడా అనర్హులకు దక్కొద్దనే సంకల్పంతోనే పని చేస్తున్నామని తెలిపారు.