తెలంగాణలో బర్డ్ ప్లూ ఆనవాళ్లు లేవు, అపోహలు వద్దు – మంత్రి తలసాని

తెలంగాణ రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లూ ఆనవాళ్లు లేవని, ఇప్పటివరకు ఎక్కడా అనుమానాస్పద కేసులు నమోదు కాలేదని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు.

ప్రజలు అనవసర భయాందోళన, అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. మంగళవారం బీఆర్‌కే భవన్‌లో రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లూ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యా ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లూ వచ్చే అవకాశం ఏ మాత్రం లేదని చెప్పారు. సరిహద్దు జిల్లాలో పశుసంవర్థకశాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

చికెన్‌, కోడిగుడ్డు తింటే బర్డ్‌ ఫ్లూ వస్తుందనేది అపోహ మాత్రమేనని అన్నారు. అనంతరం మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. బర్డ్‌ ఫ్లూతో ఇప్పటివరకు మనుషులకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హెల్త్‌ ర్యాపిడ్‌ యాక్షన్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. అపోహల వల్ల పౌల్ట్రీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని పేర్కొన్నారు. సమావేశంలో పశుసంవర్థక, మత్స్యశాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ డిప్యూటీ కార్యదర్శి రిజ్వీ, ఎంపీ జితేందర్‌ రెడ్డితోపాటు పలు పౌల్ట్రీ సంస్థల యజమానులు పాల్గొన్నారు.

Follow Us@