బీఈడీ ప్రవేశ పరీక్షకు కొత్త నిబంధనలు

తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ ప్రవేశపరీక్ష అర్హతలు, ఇతర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి సిఫారసుల మేరకు బీఈడీ ప్రవేశపరీక్ష నిబంధనలను సవరించింది. బీబీఏ పట్టభద్రులు కూడా బీఈడీ చేసే అవకాశం కల్పించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక నుంచి బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ హోంసైన్స్, బీసీఏ, బీబీఎం, బీఏ ఓరియెంటల్ లాంగ్వేజెస్‌తో పాటు బీబీఏ పట్టభద్రులు కూడా బీఈడీ ప్రవేశపరీక్ష రాయొచ్చు. 50శాతం మార్కులతో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఇతర కోర్సుల్లాగానే ఇంజనీరింగ్ పట్టభద్రుల ఉత్తీర్ణతా మార్కుల శాతాన్ని కూడా 50శాతానికి తగ్గించారు. బీఈడీ అన్ని మెథడాలజీల కోర్సుల కోసం ఒకే ప్రవేశపరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో సీట్ల శాతం, ఆయా మెథడాలజీలకు అర్హతా సబ్జెక్టులను కూడా ఖరారు చేశారు. గణితానికి 25శాతం, ఫిజికల్ సైన్సెస్, బయాలజీకి 30శాతం సీట్లు ఉంటాయి. ఫిజికల్ సైన్సెస్, బయాలజీలో కనీసం పదిశాతం చొప్పున గరిష్ఠంగా 20శాతానికి మించకుండా సీట్లు ఉంటాయి.

సోషల్ సైన్సెస్, ఆంగ్లం, ఓరియెంటల్ లాంగ్వేజెస్‌కు 45శాతం సీట్లు ఉంటాయి. ఆంగ్లం, ఓరియెంటల్ లాంగ్వేజెస్‌లో కనీసం 5శాతం చొప్పున రెండింటికీ కలిపి గరిష్ఠంగా 15శాతం వరకు సీట్లు ఉండనున్నాయి. గణితం ఓ సబ్జెక్టుగా బీఏ, బీఎస్సీ, బీఈ, బీటెక్ పూర్తి చేసిన వారితో పాటు ఇంటర్‌లో గణితం చదివిన బీసీఏ పట్టభద్రులు మాథ్స్ మెథడాలజీకి అర్హులు. బీఎస్సీ, బీఈ, బీటెక్‌లో ఫిజిక్స్\కెమిస్ట్రీ చదివినవారు, ఇంటర్‌లో ఫిజిక్స్\కెమిస్ట్రీ చదివిన బీసీఏ విద్యార్థులకు ఫిజికల్ సైన్సెన్‌లో బీఈడీకి అర్హత ఉంటుంది. బోటనీ\జువాలజీలో బీఎస్సీ చదివిన వారితో పాటు ఇంటర్‌లో బయాలజికల్ సైన్సెస్ చదివిన బీసీఏ విద్యార్థులు బయాలజికల్ సైన్సెస్ మెథడాలజీలో బీఈడీ చేయవచ్చు. సోషల్ సైన్సెస్ సబ్జెక్టుల్లో బీఏ చదివిన వారితో పాటు ఇంటర్‌లో సోషల్ సైన్సెస్ చదివిన బీకాం, బీబీఎం, బీబీఏ, బీసీఏ విద్యార్థులకు బీఈడీ సోషల్ సైన్సెస్ మెథడాలజీలో అర్హత ఉంటుంది.

స్పెషల్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ లిటరేచర్‌లో బీఏ చదివిన వారు లేదా ఎంఏ ఇంగ్లీష్ వారికి బీఈడీ ఇంగ్లీష్ మెథడాలజీకి అర్హత ఉంటుంది. తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ, అరబిక్, సంస్కృతం భాషల్లో బీఏ, బీఏ లిటరేచర్, బీఏ ఓరియెంటల్ లాంగ్వేజెస్ చదివిన వారికి లేదా ఎంఏ పూర్తి చేసిన వారికి ఓరియెంటల్ లాంగ్వేజెస్ బీఈడీకి అవకాశం ఉంటుంది. అన్ని మెథడాలజీలకు ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో అర్హతా సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయించనున్నారు. ఈ మేరకు బీఈడీ ప్రవేశపరీక్ష నిబంధనల్లో సవరణలు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది

NOTIFICATION PDF

Follow Us@