నూతన విద్యా సంవత్సరం, సిలబస్ తగ్గింపు పై త్వరలో నిర్ణయం – మంత్రి సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల నూతన విద్యా సంవత్సరాన్ని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పిబ్రవరి నెల ఒకటి నుంచి పాఠశాలలు/ కళాశాలలు ప్రారంభంకానున్న నేపథ్యంలో మంగళవారం మంత్రి ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులతో హైదరాబాద్ లోని SCERT భవనం లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేసి, పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.

చర్చలో భాగంగా 14 డిమాండ్లను పరిష్కరించాలని పాఠశాలల ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అంచెలంచెలుగా అన్ని తరగతులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దాదాపు ఏడాదిగా ఫీజులు లేనందున పాఠశాలలు నిర్వహణ కష్టతరంగా మారిందని యాజమాన్యాలు మంత్రికి తెలిపాయి. జూన్ వరకు విద్యా సంవత్సరం నిర్వహించాలని.. కనీస హాజరు ఉండేలా నిబంధన పెట్టాలని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలు మేరకు… ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యాబోధన చేపట్టాలన్నారు. వివిధ తరగతుల్లో సిలబస్‌ తగ్గింపుపై త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలు ప్రారంభించేందుకు సిద్ధం కావాలని.. ఇందుకు తల్లిదండ్రులు సహకరించాలని మంత్రి కోరారు.

కరోనాపై అవగాహన కల్పిస్తూ.. విద్యార్థుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాలల యాజమాన్యాలకు సూచించినట్లు చెప్పారు. పాఠశాలలకు సంబంధించి పలు సమస్యలను ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని, ప్రభుత్వం తరఫున సాధ్యమైనంత వరకు వారి సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు పాఠశాలలకు హాజరుకావాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. పాఠశాలకు హాజరవని విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వినేలా ఏర్పాట్లు చేయాలని సూచించామన్నారు.

Follow Us@