ఆసరా ఫించన్లు వెంటనే మంజూరు చేయాలి – సీఎస్ శాంతి కుమారి

హైదరాబాద్ (సెప్టెంబర్ – 20) : తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడే సామాజిక పింఛనుల ఖాళీల్లో వారి భార్యలకు వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. పంట రుణాల మాఫీ, ఎరువుల పంపిణీ, జిఓ 58, 59 అమలు, గృహలక్ష్మి, ఆసరా పింఛన్లు, సాంఘిక సంక్షేమ ఇళ్ల స్థలాల పంపిణీ, తెలంగాణకు హరితహారం, గ్రామ పంచాయతీ భవనాలు, ఆయిల్ పామ్ తోటల తదితర అంశాల్లో సాధించిన ప్రగతిని జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక పింఛనుల మంజూరిపై నిత్యం సమీక్షిస్తున్నందున, పింఛనుల ఖాళీల్లో వారి భార్యలకు వెంటనే మంజూరు చేయాలన్నారు.

రైతు రుణ మాఫీకై ప్రభుత్వం రూ. 19,446 కేటాయించిందని, అతితక్కువ సమయంలో ఈ రుణ మాఫీ ముమ్మరంగా కొనసాగుతోందన్నారు. రుణ మాఫీ పొందిన రైతులను వెంటనే కొత్తగా పంట రుణాలను అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ అంశంలో ఏర్పడే ఇబ్బందులను అధిగమించడానికి ప్రత్యేకంగా ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసి పరిష్కరించాలని అన్నారు.

రాష్ట్రంలో రైతులకు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచడం జరిగిందని, అయినప్పటికీ ఈ ఎరువుల పంపిణి సక్రమంగా జరిగేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.

నిరుపేదలకు లబ్ది చేకూరే జీ.ఓ 58 క్రింద స్వీకరించిన దరఖాస్తులను వారం రోజులలోగా దర్యాప్తు పూర్తి చేసి పట్టాలను అందచేయాలని ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 5,707 కొత్త గ్రామ పంచాయితీ భవనాలను మంజూరీ చేయడం జరిగిందని, వీటన్నింటి నిర్మాణాలను ప్రారంభించి త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

ఆయిల్ పామ్ క్రింద నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని స్పష్టం చేశారు.