MPOX VIRUS SYMPTOMS – ఎంపాక్స్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ – WHO

BIKKI NEWS (AUG. 16) ‘: MPOX VIRUS SYMPTOMS and SPREADING. కరోనా తర్వాత ఇప్పుడు ప్రపంచాన్ని మరో మహమ్మారి భయపెడుతున్నది. ఆఫ్రికా కేంద్రంగా వ్యాపించిన మంకీపాక్స్‌ ఇప్పుడు భారత్‌ పొరుగు దేశమైన పాకిస్థాన్‌కు చేరింది. ఇప్పటికే దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ వ్యాధిని 1958లో తొలిసారి గుర్తించారు.

MPOX VIRUS SYMPTOMS and SPREADING

మొట్టమొదటిసారిగా 1970లో ఇది ఒక మనిషికి సోకింది. ఉష్ణమండల ఆఫ్రికా దేశాల్లోని మారుమూల గ్రామాల్లో మాత్రమే ఈ వైరస్‌ ఎక్కువగా కనిపించేది. దాంతో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఆరోగ్య విభాగాలు దీన్ని నిర్లక్ష్యం చేశాయి. తొలిసారి 2022లో భారీ స్థాయిలో మంకీపాక్స్‌ వ్యాపించింది. ఉలిక్కిపడిన ప్రపంచ దేశాలు దీనిపై పరిశోధనలకు నిధులను పెంచాయి. ఫలితంగా గత 60 ఏళ్లలో జరిగిన పరిశోధనల కంటే ఈ రెండేళ్లలో పరిశోధనలే ఎక్కువయ్యాయి.

GLOBAL HEALTH EMERGENCY BY WHO

మంకీపాక్స్‌ గుర్తింపు, చికిత్స, నివారణకు సంబంధించి వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని ఆఫ్రికా దేశాల నుంచి పలుమార్లు ప్రపంచ దేశాలకు హెచ్చరికలు వచ్చాయి. 2022-23లో తొలిసారి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో మంకీపాక్స్‌ కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం మధ్య ఆఫ్రికాలో తీవ్రస్థాయిలో ఈ వ్యాధి వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ అత్యయిక స్థితిని ప్రకటించింది.

ప్రజారోగ్యానికి సంబంధించి ఇదే అతిపెద్ద హెచ్చరికగా చెప్పవచ్చు. దాంతో ప్రపంచ దేశాలు సమన్వయంతో పని చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచంలో ఏదో ఒక మూల ఈ అంటువ్యాధి వచ్చిందని, మిగిలిన దేశాలు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని దీని వ్యాప్తి స్పష్టం చేస్తోంది. మంకీపాక్స్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. వీటిని క్లాడ్‌-1 (కాంగోబేసిన్‌ క్లాడ్‌), క్లాడ్‌-2 (పశ్చిమ ఆఫ్రికా క్లాడ్‌) గా వర్గీకరించారు.

వీటిలో క్లాడ్‌-1 తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది. న్యుమోనియా, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయి. దీనిలో మరణాల రేటు 1-10 శాతం వరకు ఉంది. ఇక క్లాడ్‌-2 కొంత తక్కువ ప్రమాదకరం. దీనిలో శరీరంపై పొక్కులు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మరణాల రేటు 1 శాతం కంటే తక్కువే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్లాడ్‌-1 ఐబీ వేరియంట్‌ వేగంగా వ్యాపించడమే ఆందోళనకు కారణం.

లైంగిక సంబంధాల కారణంగా ఈ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తుంది. గతంలో ఈ విధంగా క్లాడ్‌-1 వ్యాపించేది కాదని జనవరిలో విడుదలైన ఓ పరిశోధనా పత్రం పేర్కొంది. ఇది జంతువుల నుంచి మనుషుల్లోకి మాత్రమే వ్యాపించేవి. ప్రస్తుతం నాలుగు దేశాల్లో క్లాడ్‌-1లోని వేరియంట్లు సోకిన 100 కేసులను గుర్తించారు. బురుండి, కెన్యా, రువాండా, ఉగాండా దేశాల్లో ఈ కేసులు ఉన్నాయి.

ఇక ఇప్పటివరకు మొత్తం మంకీపాక్స్‌ కేసుల సంఖ్య 15,600 కు చేరింది. అందులో 537 మరణాలు నమోదయ్యాయి. వీటిలో 96 శాతం మరణాలు కాంగోలోనే చోటుచేసుకొన్నాయి. భారత్‌లో 2022లో మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. 27 మందికి ఇది సోకినట్లు నిర్ధారించారు.

MPOX VIRUS SPREADING

నేరుగా తాకడం వల్ల మంకీపాక్స్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది.

నోరు, ఇతర అవయవాల నుంచి వచ్చే స్రావాల వల్ల కూడా సోకే అవకాశం ఉంది.

ఇక రోగులు వాడిన దుస్తులు, ఇతర వస్తువుల వినియోగం, పచ్చబొట్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి మంకీ పాక్స్‌ వచ్చే అవకాశం ఉంది.

ఈ వ్యాధి సోకిన జంతువులను కొరకడం, తాకడం వల్ల మనుషుల్లోకి ఈ వైరస్‌ ప్రవేశించవచ్చు.

MPOX VIRUS SYMPTOMS

ఈ వైరస్‌ మనిషి శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత 1 నుంచి 21 రోజుల్లో ఎప్పుడైనా లక్షణాలు బయటపడవచ్చు.

పొక్కులు, జ్వరం, గొంతు ఎండిపోవడం, తల, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ వంటివి ఉంటాయి.

ఇవి దాదాపు 2 నుంచి 4 వారాలపాటు కొనసాగవచ్చు. ఇది సదరు వ్యక్తి రోగ నిరోధక శక్తిపై ఆధారపడి ఉంటుంది.

ప్రస్తుతం మంకీపాక్స్‌ నివారణకు రెండు టీకాలు వినియోగంలో ఉన్నాయి. వీటిని గత వారమే ప్రపంచ ఆరోగ్య సంస్థ స్ట్రాటజిక్‌ అడ్వైజరీ గ్రూప్‌ అత్యవసర వినియోగానికి లిస్టింగ్‌ చేసింది. దీంతో గావీ, యూనిసెఫ్‌ కొనుగోలు చేసి పంపిణీ చేసేందుకు మార్గం సులభమైంది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు