BIKKI NEWS (APR. 11) : METRO EXTENDING UPTO FUTURE CITY SAYS CM REVANTH REDDY. హైదరాబాద్ మెట్రోను ఫ్యూచర్ సిటీ వరకు విస్తరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు. ఈ విస్తరణకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో మెట్రో విస్తరణపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారు.
METRO EXTENDING UPTO FUTURE CITY SAYS CM REVANTH REDDY
మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందని, ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు జరిపినట్లు అధికారులు వివరించారు.
నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు (36.8 కి.మీ.), రాయదుర్గం – కోకాపేట నియోపోలిస్ (11.6 కి.మీ.), ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.), మియాపూర్ – పటాన్‌చెరు (13.4 కి.మీ.), ఎల్‌బీ నగర్ – హయత్‌నగర్ (7.1 కి.మీ.) మొత్తం కలిపి 76.4 కి.మీ.ల విస్తరణకు రూ.24,269 కోట్ల అంచనాలతో హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది.
కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చెరిసగం నిధులు భరించేలా జాయింట్ వెంచర్‌గా ఈ ప్రాజెక్టు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేసింది. కేంద్రం నుంచి అనుమతులు సాధించేందుకు నిరంతరం ప్రయత్నించాలని, అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు.
ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) వరకు 40 కిలోమీటర్ల మేరకు మెట్రో విస్తరించేందుకు కొత్తగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు నగర విస్తరణ అవసరాల దృష్ట్యా మెట్రోను మీర్ఖాన్‌పేట్ వరకు పొడిగించాలని చెప్పారు.
అందుకు అవసరమయ్యే అంచనాలతో డీపీఆర్ తయారు చేసి కేంద్రానికి పంపించాలని సూచించారు. హెచ్ఎండీఏ (HMDA)తో పాటు ఫ్యూచర్ సిటీ డెవెలప్మెంట్ అథారిటీ (FCDA) ని ఈ రూట్ మెట్రో విస్తరణలో భాగస్వామ్యులను చేయాలని చెప్పారు.
ముఖ్యమంత్రి గారితో పాటు సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, శ్రీనివాసరాజు గారు, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గారు, సంబంధిత ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్