BIKKI NEWS (MARCH 22) : లిక్కర్ స్కామ్ లో డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో… ఈ స్కామ్ గురించి పూర్తి సమాచారం (LIQUOR SCAM FULL STORY).
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 2021 నవంబర్ లో నూతన మద్యం విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం ప్రకారం.. లిక్కర్ రిటైల్ విక్రయాల నుంచి ప్రభుత్వం తప్పుకుంది. మద్యం దుకాణాలను నడపడానికి ప్రైవేట్ లైసెన్స్ దారులకు అనుమతులు ఇచ్చింది. దీనివల్ల లిక్కర్ బ్లాక్ మార్కెటింగ్ కు అడ్డుకట్ట పడుతుందని, ప్రభుత్వ ఆదాయం భారీగా పెరుగుతుందని అరవింద్ కేజ్రివాల్ సర్కారు ప్రకటించింది.
కొత్త పాలసీ కింద మద్యం దుకాణాలను అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా.. తెల్లవారు జామున 3 గంటల వరకు తెరిచి ఉంచవచ్చు. మద్యంపై ప్రైవేట్ లైసెన్స్ దారులు అపరిమితమైన డిస్కౌంట్ ప్రకటించవచ్చు. వినియోదారులకు ఆకర్శణీయమైన ఆఫర్లు ఇవ్వొచ్చు. లిక్కర్ హోం డెలివరీ కూడా చేయ్యొచ్చు. ఇవన్నీ మద్యం అమ్మకాలు పెంచుకోవడానికి ఉద్దేశించినవే.
కొత్త పాలసీ వల్ల లిక్కర్ ఫమపై ఆదాయం 27 శాతం పెరిగిందని, రూ.8,900 కోట్ల రాబడి వచ్చిందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
కొత్త మద్యం విధానంలో చాలా ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని, ప్రైవేట్ లైసెన్స్ దారులకు అనుచిత ప్రయోజనాలు కల్పించారని స్పష్టం చేస్తూ 2022 జూలైలో ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్ ఒక నివేదిక విడుదల చేశారు.
కోవిడ్ – 19 వ్యాప్తి సమయంలో ప్రైవేట్ వ్యాపారులకు ప్రభుత్వం రూ.144 కోట్ల మేర లైసెన్స్ ఫీజు మినహాయింపు ఇచ్చిందని వెల్లడించారు.
చీఫ్ సెక్రెటరీ నివేదికపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీపై సీబీఐ విచారణ జరపాలంటూ సిఫార్సు చేశారు. తమపై వస్తున్న ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కొట్టిపారేశారు. తర్వాత కొన్ని రోజులకే నూతన లిక్కర్ పాలసీని కేజ్రివాల్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
400 మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఢిల్లీలో మద్యం విక్రయాలు మళ్లీ ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చాయి. లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు మేరకు లిక్కర్ స్కామ్ పై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది.
2022 ఆగస్టులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, మనీష్ సిసోడియా నివాసంతోపాటు 31 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. అయితే, ఈ సోదాల్లో సీబీఐకి ఎలాంటి ఆధారాలు దొరక లేదని మనీష్ సిసోడియా చెప్పారు. తమ పార్టీని అప్రతిష్టపాలు చేయడానికి బీజేపీ పెద్దలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కూడా జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గుర్తించింది. మనీష్ సిసోడియాతో పాటు మరో 14 మందిపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఎస్ఐఆర్ ఆధారంగా ఈడీ సైతం కేసు నమోదు చేసింది. దర్యాప్తునకు శ్రీకారం చుట్టింది.
అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి, కె.చంద్రశేఖరరావు కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత నేతృత్వంలోని సౌత్ గ్రూప్ కు లబ్ధి చేకూర్చడానికి వీలుగా కొత్త లిక్కర్ పాలసీని కేజ్రీవాల్ ప్రభుత్వం రూపొందించినట్లు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. సౌత్ గ్రూప్ కు పెద్ద ఎత్తున లైసెన్స్లు దక్కినట్లు తేల్చింది.
తమకు అనుకూలంగా మద్యం విధానాన్ని రూపొందించినందుకు ప్రతిఫలంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ గ్రూప్ రూ.100 కోట్ల ముడుపులు చెల్లించినట్లు ఈడీ ఆరోపించింది. ఈ సొమ్మును గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు చేసినట్లు తెలియజేసింది.
ఢిల్లీ లో లిక్కర్ వ్యాపారం ద్వారా సౌత్ గ్రూప్ ఈ రూ.100 కోట్లు తిరిగి రాబట్టుకున్నట్లు పేర్కొంది. నూతన లిక్కర్ పాలసీ వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి రూ.2,800 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఈడీ తేల్చిచెప్పింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరుణ్ పిళ్ళై, సమీర్ మహేంద్రు, పి. శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, అమిత్ అరోరా, గోరంట్ల బుచ్చిబాబు, గౌతమ్ మల్హోత్రా, రాజేష్ మాగుంట రాఘవ, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు. వీరిలో అరుణ్ పిట్లె మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ జ్యుడీషి యల్ కస్టడీలో ఉండగా, కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు.
మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా, మాగుంట రాఘవ, గోరంట్ల బుచ్చిబాబు పి. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్లుగా మారారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఈ కేసులో సీబీఐ విచారించింది. తాజాగా ముఖ్యమం త్రి అరవింద్ కేజ్రివాల్ ను ఈడీ అదుపులోకి తీసుకుంది.
Source – Sakshi