★ ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ 4.0 లక్ష్యం ఏమిటి.?
ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ (ఐఎంఐ) 4.0ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వర్చువల్‌గా ఫిబ్రవరి 7న ప్రారంభించారు. 33 రాష్ర్టాల్లోని 416 జిల్లాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. గర్భిణులు, పిల్లల్లో ఇమ్యునైజేషన్‌ను రెట్టింపు చేసే ఉద్దేశంతో ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని 2014, డిసెంబర్‌లో ప్రారంభించారు.
★ వాతావరణం, భూమి పరిరక్షణ కోసం మహారాష్ట్ర ప్రారంభించిన కార్యక్రమం పేరు.?
‘మాఝీ వసుంధర’ ప్రచారానికి మద్దతుగా మహారాష్ట్ర ప్రభుత్వంతో యునైటెడ్ నేషన్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌ఈపీ) కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంపై ఫిబ్రవరి 9న సంతకాలు చేశాయి. వాతావరణం, భూమి పరిరక్షణ కోసం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం మాఝీ వసుంధర అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
★ వన్ నేషన్ వన్ రేషన్ కార్డు వినియోగంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం.?
ఆగస్టు 2019లో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ప్లాన్ ప్రారంభమైనప్పటి నుంచి జనవరి 31, 2022 వరకు అత్యధిక లావాదేవీలు నిర్వహించిన రాష్ర్టాల్లో బీహార్ 15.90 కోట్లతో మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర వినియోగ వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే ఫిబ్రవరి 9న తెలిపారు. ఆంధ్రప్రదేశ్ (8.51 కోట్లు) 2, రాజస్థాన్ (6.67 కోట్లు) 3, తెలంగాణ (5.16 కోట్లు) 4వ స్థానాల్లో నిలిచాయి.
★ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడ నిర్మిస్తున్నారు.?
జైపూర్ దగ్గరలోని చాంప్ గ్రామంలో నిర్మించనున్న ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రికెట్ స్టేడియానికి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఫిబ్రవరి 5న శంకుస్థాన చేశారు. ఈ కార్యక్రమానికి , బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బీసీసీఐ కార్యదర్శి జై షా, రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వైభవ్ గెహ్లాట్ హాజరయ్యారు. దీని సీటింగ్ కెపాసిటీ 75,000 మంది ప్రేక్షకుల సామర్థ్యంతో నిర్మించనున్నారు. అహ్మదాబాద్‌లోని మోతెరా క్రికెట్ స్టేడియం సీటింగ్ కెపాసిటీ లక్షా పదివేలు, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) సీటింగ్ కెపాసిటీ లక్ష.
★ 1000వ వన్డే ఆడిన మొదటి క్రికెట్ జట్టు ఏదీ.?
ప్రపంచ క్రికెట్‌లో 1000వ వన్డే ఆడిన తొలి జట్టుగా భారత్ టీం రికార్డు నెలకొల్పింది. ఫిబ్రవరి 6న అహ్మదాబాద్‌లో భారత్ వెస్టిండీతో తొలి వన్డే ఆడి గెలిచింది. ఈ వన్డేతో ఈ భారత్ టీం ఈ మైలురాయిని చేరింది.
★ టాటా ఓపెన్ టెన్నిస్ విజేతలు
టాటా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సింగిల్స్‌ను పోర్చుగల్ ఆటగాడు జోవో సౌసా గెలుచుకున్నాడు. మహారాష్ట్రలో ఫిబ్రవరి 6న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సౌసా ఫిన్లాండ్ ఆటగాడు ఎమిల్ రుసువూరిని ఓడించాడు. డబుల్స్ టైటిల్‌ను రోహన్ బోపన్న-రామ్‌కుమార్ రామనాథన్ జోడీ గెలుచుకున్నారు. వీరు ఆస్ట్రేలియా జోడీ ల్యూక్ సావిల్లే-జాన్ పాట్రిక్ స్మిత్‌పై గెలిచారు.
★ ఆసియా కప్ 2022 ఫుట్‌బాల్ విజేత ఎవరు.?
2022 ఆసియా కప్ మహిళల ఫుట్‌బాల్ టోర్నీని చైనా జట్టు సాధించింది. ముంబైలో ఫిబ్రవరి 6న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చైనా దక్షిణ కొరియాను ఓడించింది. ఈ ఆసియా కప్‌ను గెలవడం చైనాకు ఇది తొమ్మిదోసారి.
★ ఆఫ్రికన్ కప్ ఆఫ్ నేషన్స్ టైటిల్ విజేత ఎవరు.?
సెనెగల్ ఫుట్‌బాల్ టీం తొలి ఆఫ్రికన్ కప్ ఆఫ్ నేషన్స్ టైటిల్‌ను సాధించింది. ఫిబ్రవరి 6న కామెరూన్ యౌండేలోని ఒలెంబే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఈజిప్ట్‌ను ఓడించింది.
★ ఎల్‌ఎన్‌జీతో నడిచే నౌక పేరు ఏమిటి.?
ప్రపంచంలో తొలి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ)తో నడిచే నౌక ఎల్‌ఎన్‌జీని నింపుకోవడానికి ఫిబ్రవరి 7న సింగపూర్‌కు చేరింది. కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు ఆస్ట్రేలియన్ మైనింగ్ కంపెనీ అయిన బీహెచ్‌పీ తీసుకొస్తున్న ఐదు బల్క్ క్యారియర్ నౌకలో మొదటిది ‘ఎంబీ ఎంటీ టూర్మలైన్ న్యూక్యాజిల్‌మ్యాక్స్’. 2050 నాటికి సున్నా శాతం కర్బన ఉద్గారాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు బీహెచ్‌పీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వందిత పంత్ పేర్కొన్నారు.
★ అమెరికా ఏ దేశానికి 100 మిలియన్ డాలర్ల రక్షణ సాయం చేయనుంది.?
తైవాన్‌లో క్షిపణి రక్షణ వ్యవస్థ కోసం 100 మిలియన్ డాలర్ల సాయానికి అమెరికా ఆమోదం తెలిపిందని పెంటగాన్ ఫిబ్రవరి 7న వెల్లడించింది. చైనా నుంచి ముప్పు ఎదుర్కొంటున్న తైవాన్‌లో క్షిపణి రక్షణ వ్యవస్థను ఈ నిధులతో పటిష్టం చేయనున్నది. తైవాన్ వద్ద ప్రస్తుతం ఉన్న గగనతల క్షిపణులు, అమెరికా అందించే అధునాతన పేట్రియాట్ క్షిపణుల నిర్వహణకు తోడ్పడనున్నది.
★ వరల్డ్ పల్సెస్ డే ఏ రోజున జరుపుకుంటారు.?
ఐక్యరాజ్యసమితి గుర్తించిన వరల్డ్ పల్సెస్ డే (ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం)ని ఫిబ్రవరి 10న నిర్వహిస్తారు. ఈ సంవత్సర దీని థీమ్ ‘పల్సెస్ టు ఎంపవర్ యూత్ ఇన్ అచీవింగ్ సస్టెయినబుల్ అగ్రిఫుడ్ సిస్టమ్స్ (స్థిరమైన వ్యవసాయ ఆహార వ్యవస్థలను సాధించడంలో యువతను శక్తిమంతం చేయడానికి పప్పులు)’.
★ తాజాగా ప్రకటించిన నాసా మిషన్‌ల పేర్లు ఏమిటి.?
నిరంతరం మారుతున్న అంతరిక్ష వాతావరణం, సూర్యుడు-భూమి కనెక్షన్ గురించి తెలుసుకునేందుకు రెండు మిషన్‌లను ఎంపిక చేశామని నాసా ఫిబ్రవరి 10న వెల్లడించింది. మల్టీ-స్లిట్ సోలార్ ఎక్స్‌ప్లోరర్ (ఎంయూఎస్‌ఈ), హేలియోస్వార్మ్ అనే రెండు సైన్స్ మిషన్ ఎంపిక చేసింది. ఇవి వ్యోమగాములు, ఉపగ్రహాలు, జీపీఎస్ సిగ్నళ్లను రక్షించడం కోసం క్లిష్టమైన సమాచారాన్ని అందిస్తాయి. ఎంయూఎస్‌ఈ మిషన్ సూర్యుని కరోనా హీటింగ్ చోదక శక్తులను అర్థం చేసుకోవడంలో సైంటిస్టులకు సహాయపడుతుంది.
★ ఆస్ట్రేలియా అంతరించిపోతున్న జంతువుగా ఏ జీవిని ప్రకటించింది.?
అంతరించిపోతున్న జంతువుగా కోలాను గుర్తించినట్లు ఆస్ట్రేలియా ఎన్విరాన్‌మెంట్ మంత్రి సుసాన్ లే ఫిబ్రవరి 11న తెలిపారు. వాతావరణ మార్పులు, వ్యాధులు, నివాసయోగ్యం లేకపోవడం వల్ల ఈ జాతి అంతరించే దశకు వచ్చిందన్నారు. వీటి సంరక్షణ కోసం ప్రణాళిక చేస్తామన్నారు.
★ వన్ ఓషన్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించారు.?
ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు సహకారంతో బ్రెస్ట్‌లో ఫిబ్రవరి 9 నుంచి 11 వరకు వన్ ఓషన్ సమ్మిట్‌ను ఫ్రాన్స్ వర్చువల్‌గా నిర్వహించింది. ఈ సమ్మిట్‌లో భారత్, యూకే, దక్షిణ కొరియా, కెనడా పాల్గొన్నాయి. ఈ సమావేశంలో ‘బయోడైవర్సిటీ బియోండ్ నేషనల్ జూరిస్‌డిక్షన్ (బీబీఎన్‌జే)’ని యూరోపియన్ యూనియన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ ప్రారంభించారు.
★ లతా మంగేష్కర్
ప్రఖ్యాత గాయని, భారతరత్న లతా మంగేష్కర్ ఫిబ్రవరి 6న మరణించారు. 1929, సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆమె జన్మించారు. 1969లో పద్మభూషణ్, 1989లో దాదాసాహెబ్ ఫాల్కే, 1997లో మహారాష్ట్ర భూషణ్, 1999లో పద్మవిభూషణ్, 1999లో ఎన్‌టీఆర్ జాతీయ అవార్డు, 2001లో భారతరత్న, 2007లో ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం, 2009లో ఏఎన్‌ఆర్ జాతీయ అవార్డు లభించాయి.
★ దినేష్ ప్రసాద్
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ)కు కొత్త డైరెక్టర్‌గా దినేష్ ప్రసాద్ సక్లానీ నియమితులైనట్లు అధికారులు ఫిబ్రవరి 7న తెలిపారు. 2020, నవంబర్‌లో పదవీకాలం ముగిసిన హుషికేశ్ సేనాపతి స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో 5 ఏండ్లు లేదా ఆయనకు 65 ఏండ్లు వచ్చే వరకు ఉంటారు.
★ శాంతిశ్రీ
ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) వైస్‌చాన్స్‌లర్ (వీసీ)గా శాంతిశ్రీ ధూళిపూడి ఫిబ్రవరి 7న నియమితులయ్యారు. దీంతో జేఎన్‌యూ వీసీగా నియమితులైన తొలి మహిళగా ఆమె రికార్డుకెక్కారు. ప్రస్తుతం ఆమె సావిత్రీబాయి ఫూలే యూనివర్సిటీ వీసీగా పనిచేస్తున్నారు.
★ ప్రవీణ్‌కుమార్ సోబ్జీ
నటుడు, క్రీడాకారుడు ప్రవీణ్‌కుమార్ సోబ్జీ ఫిబ్రవరి 7న మరణించాడు. క్రీడాకారుడిగా ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో డిస్కస్ త్రో, హ్యామర్ త్రో ఈవెంట్లలో పతకాలు సాధించాడు. 1947, డిసెంబర్ 6న పంజాబ్ రాష్ట్రం టార్న్ తరుణ్ జిల్లా సర్హలి కలాన్‌లో జన్మించిన ఆయన దూరదర్శన్‌లో 90వ దశకంలో ప్రసారమైన మహాభారత్ సీరియల్‌లో భీముడిగా నటించాడు.
★ రాంసింగ్
ఎమినెంట్ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు-2021’కు లకావత్ రాంసింగ్‌ను ఎంపిక చేసినట్లు నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అకాడమీ (నెసా) అధ్యక్షుడు జావెద్ అహ్మద్ ఫిబ్రవరి 8న ప్రకటించారు. రాంసింగ్ హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సదస్సుల నిర్వహణ, గోపాత మిత్రలకు శిక్షణ కార్యక్రమాలు, వెటర్నరీ వైద్య కోర్సు ఫైనలియర్ విద్యార్థులకు అవగాహన కల్పించడం, బొవైన్ బ్రీడింగ్‌లో జాతీయ స్థాయి ప్రాజెక్టు పర్యవేక్షణ లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అవార్డుకు ఎంపిక చేశారు.
★ ఉన్నికృష్ణన్ నాయర్
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ) కొత్త డైరెక్టర్‌గా ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్ ఫిబ్రవరి 8న నియమితులయ్యారు. ఇస్రో చైర్మన్‌గా నియమితులైన ఎస్ సోమనాథ్ స్థానంలో ఆయన ఎంపికయ్యారు. వీఎస్‌ఎస్‌సీలో 1985లో చేరిన ఆయన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
Follow Us @