జగిత్యాల (సెప్టెంబర్ – 08) : గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలుస్తుందని ట్రస్ట్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహలత అభయమిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద మధ్య తరగతి విద్యార్థులు ఆర్థిక భారం వల్ల విద్యకు దూరం అవుతున్నారని, అలాంటి వారిని గుర్తించి వారికి అండగా నిలుస్తామని అన్నారు.
గురువారం రోజున గొల్లపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొంతమంది విద్యార్థులు సరియైన రవాణా సౌకర్యం లేకుండా కళాశాల విద్యను మధ్యలోనే మానివేస్తున్నారని.. అలాంటివారికి ట్రస్టు ద్వారా సైకిళ్లు పంపిణీ చేసి విద్యకు ఆటంకం జరగకుండా చూస్తామన్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో చాలామంది నిరుపేదలకు, అనాధలకు చారిటబుల్ ట్రస్ట్ ఆపన్న హస్తాన్ని అందించిందని రాబోయే కాలంలో కూడా ట్రస్ట్ సేవలు మరింత అందిస్తామన్నారు. విద్యార్థులు ఇంటర్మీడియట్ సమయంలో కేవలము విద్యకి పరిమితం కావాలని.. ఇతరత్రా వ్యాపకాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు. సమాజంలో ఉన్నతులుగా ఎదగాలంటే విద్యతో మాత్రమే అది సాధ్యమని అన్నారు. కళాశాల విద్యార్థులకు సాధ్యమైనంత మరిన్ని సేవలు చేయడానికి చారిటబుల్ ట్రస్ట్ తన శాయశక్తిలా కృషి చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఏనుగుల మల్లయ్య, జెడ్పిటిసి గోస్కుల జలంధర్, మండల పరిషత్ ఉపాధ్యక్షులు ఆవుల సత్యం, స్థానిక మండల ప్రజాప్రతినిధులు, ట్రస్ట్ సభ్యులు, కళాశాల లెక్చరర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Follow Us @