రైతుభీమా తరహాలో.. కార్మిక భీమా – హరీష్ రావు

సిద్ధిపేట (జూలై – 30) : జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం అధ్యక్షతన రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికుల బహిరంగ సభలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏ ప్రగతికైనా మూల ఆధారం కార్మికుడు. ప్రభుత్వం అయినా ప్రైవేట్ అయినా నడిచేది కార్మికుడి కష్టం మీదనే. సంపాదించే ధనానికి ఇం”ధనం” కార్మికుడి చెమట చుక్కనే అని ఉద్ఘాటించారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మీ భవన నిర్మాణ రంగ కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హమీ ఇచ్చారు. సిద్ధిపేటలో కార్మిక భవన్ కు ఎకరం స్థలం కేటాయింపు చేశారు.

ప్రతీ భవన నిర్మాణ కార్మికుడు కార్డు కలిగి ఉండాలి. అందుకు అవసరమైన డబ్బులు నేనే భరిస్తా. కార్డు ఉంటేనే మీరు లబ్ధి పొందే అవకాశం ఉంది. అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకుని కార్డు పొందాలి. కార్మికుడి కార్డు రెన్యూవల్ పదేళ్లకు పెంపు. లక్షన్నర నుంచి రూ.3 లక్షలకు భీమా పెంపు.

◆ కార్మిక-ఆరోగ్య శాఖ ఒప్పందం

ఇటీవల కార్మిక-ఆరోగ్య శాఖ కార్మికుడి వైద్య సేవలపై చర్చించి ఒప్పందం కుదిరించుకున్నాం. రూ.5లక్షల వరకూ ఉచితంగా ఆరోగ్య శ్రీ వైద్య సేవలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వర్తిస్తుంది. అలాగే క్యాన్సర్, గుండె చికిత్సలకు రూ.10 లక్షల వరకూ ఆరోగ్య భీమా వర్తించేలా ఈ ఆగస్టు నెల నుంచి అమలు కాబోతుంది.