ఇంటర్ విద్యా జేఏసీ కన్వీనర్ మధుసుదన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ

తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ లో ఉన్న సమస్యలు, కరోనా నేపథ్యంలో  ఇంతవరకు ప్రారంభం కాని ఆప్ లైన్ తరగతులు, నూతన విద్యా విధానం, ఇంటర్ విద్యా భవిష్యత్తు, ప్రస్తుత విద్యా సంవత్సరం, తాత్కాలిక ఉద్యోగుల సమస్యలు ఇలా అనేక ఇతర అంశాలపై తెలంగాణ ఇంటర్ విద్యా జేఏసీ  కన్వీనర్ మధుసుదన్ రెడ్డి గారు తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్లు వివరిస్తూ ఇంటర్ విద్య అధికారులకు మరియు ప్రభుత్వానికి అనేక విలువైన సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది.

● ఆప్ లైన్ తరగతులను ప్రారంభించాలి

ప్రస్తుతం కరోనా నేపద్యంలో జూన్ నుండి ప్రారంభం కావాల్సిన విద్యా సంవత్సరం సెప్టెంబర్ నుండి ఆన్లైన్ తరగతులు ద్వారా ప్రారంభమైంది, కానీ జరుగుతున్న ఆన్లైన్ తరగతులు విద్యార్థులకు కేవలం 10 శాతం మాత్రమే జ్ఞానాన్ని అందిస్తున్నాయని కావున ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించాలని  సూచించారు.

ఆన్లైన్ తరగతులను విద్యార్థులు  టీవీ‌, యూట్యూబ్ ద్వారా చూస్తున్నట్లు తెలుస్తుందని, దీని వల్ల కేవలం 50 శాతం మంది విద్యార్థులు మాత్రమే డిజిటల్ తరగతులను ఫాలో అవుతున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయని, మిగతా 50 శాతం విద్యార్థులు రోజు కూలీలకు వెళ్ళండం జరుగుతుందని తెలిపారు.

● ప్రత్యామ్నాయ ప్రణాళిక అవసరం

ఈ సమస్యలను అధిగమించడానికి  100% అధ్యాపకులను వెంటనే కళాశాలకు  అనుమతించాలని,  ఆన్లైన్ తరగతులను పెంచాలని మరియు 200 లోపు విద్యార్థులు ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  తరగతులను  ప్రారంభించాలని, 200 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న  ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులను ఖాళీగా ఉన్న పాఠశాలలకు గ్రూప్ ల వారీగా కేటాయించి  ఆఫ్ లైన్ తరగతులను ప్రారంభించాలని ఖాళీగా ఉన్న ప్రభుత్వ/ ప్రైవేటు పాఠశాలల భవనాలను ఉపయోగించుకోవాలని తెలియజేశారు.

ఇంటర్మీడియట్ తర్వాత రాష్ట్రీయ జాతీయ స్థాయి పోటీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఈ సంవత్సరం విద్యార్థులకు ఇప్పటికే చాలా నష్టం జరిగిందని  కావున వెంటనే ఆప్ లైన్ తరగతులను తగిన జాగ్రత్తలు తీసుకోని ప్రారంభించాలని తెలియజేశారు.

ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ కనీసం 220 పని దినాలు ఉంటాయని కానీ ప్రస్తుతం 100 పని దినాలు కూడా ఈ సంవత్సరం జరిగేలా లేవని కావున ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించాలని తెలియజేశారు.

● విద్యార్థుల మద్య మరింత అంతరం.

ప్రైవేట్ కాలేజీలు రాష్ట్రంలో రెండు రకాలుగా ఉన్నాయి అని ఒకటి కార్పొరేట్ కళాశాలలో కాగా రెండవది గ్రామీణ ప్రాంతాలలోని ప్రైవేటు జూనియర్ కళాశాలు/ ప్రభుత్వ జూనియర్ కళాశాలు అని ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జూనియర్ కళాశాలలో కూడా ఈ కరోనా నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆన్లైన్ తరగతులు నిర్వహించలేక, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు కాక, అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మరోవైపు కార్పొరేట్ కళాశాలలు ఇప్పటికే ఆన్లైన్ తరగతులు ప్రారంభించి ఐపీఈ, ఐఐటీ, నీట్, ఎంసెట్ కు సంబంధించిన సిలబస్ న్ పూర్తి చేసే స్థితికి చేరాయని తెలిపారు.

కార్పొరేట్ కళాశాల విద్యార్థులకు మిగతా ప్రైవేట్/ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని ఈ కరోనా నేపథ్యంలో ఈ అంతరం మరింతగా పెరిగి కార్పొరేట్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు అవకాశాలు ఎక్కువగా ఉండి చిన్న చిన్న ప్రైవేట్, ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు సరి అయిన అవకాశాలు లభించే అవకాశం లేదని దీనిని వెంటనే ప్రభుత్వం గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపింది.

● గురుకుల/ ప్రైవేటు కళాశాలల హస్టల్స్ పై

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక భారీ ఎత్తున గురుకుల విద్యా సంస్థలను పెంచడం జరిగిందని దాదాపు 500 గురుకుల విద్యా సంస్థలు  కలవని, అలాగే ప్రైవేట్ హాస్టల్ లో కూడా ప్రస్తుతం తెరిచే పరిస్థితి లేదని ఒకే భవనంలో వేలాది మంది విద్యార్థులు కలిసి ఉండటం వలన కరోనా విజృంభించే అవకాశం ఉందని కావున ఈ సంవత్సరానికి గురుకుల  హస్టళ్ళకు, ప్రైవేట్ హాస్టల్ కు అనుమతి ఇవ్వకుండా ఆ విద్యార్థులకు  డే స్కాలర్ లుగా గుర్తించి వారిని పరీక్షలకు అనుమతించాలని సూచించారు.

● జే.ఎల్ నోటిఫికేషన్ విడుదల చేయాలి.

404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 6500 మంది జూనియర్ అధ్యాపకులు అవసరం ఉండగా ప్రస్తుతం కేవలం 1,000 మంది మాత్రమే రెగ్యులర్ జూనియర్ అధ్యాపకులు పనిచేస్తున్నారని, దాదాపు 3,700 మంది కాంట్రాక్టు అధ్యాపకులు, 1500 మంది అతిథి మరియు ఎంటీఎస్ అధ్యాపకులు ఇలా వివిధ రూపాలలో కలగూర గంపాల ఉన్నారని తెలిపారు.  

12 సంవత్సరాల నుండి జే.ఎల్. నోటిఫికేషన్ లేదని కావున క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి అంటే ఈ  కనీసం రెండు వేల జే.ఎల్. పోస్టులను భర్తీ చేయాలని తద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాణ్యమైన విద్య అందించవచ్చని  సూచించారు.

● నూతన విద్యా విధానం భవిష్యత్ భారతానికి మార్గదర్శి.

1986లో ప్రవేశపెట్టిన  విద్యా విధానం 1992లో సవరించబడి ఇప్పటిదాకా అమలవుతుందని, ఈ  ఈ విద్యా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని భావనతో కేంద్రం ప్రభుత్వం నూతన విద్యా విధానం 2020 తీసుకొచ్చిందని ఈ విద్యా విధానం భవిష్యత్ భారతానికి బైబిల్ లాంటిదని తెలిపారు.

కేజీ నుంచి పీజీ వరకు సమూల మార్పులు సూచించిందని దీనికి పూర్తిగా మద్దతు తెలపాలని సూచించారు. పాత విద్యావిధానంలో ఎనిమిదవ తరగతి విద్యార్థి కూడా చిన్న చిన్న కూడికలు – తీసివేతలు, వ్రాత నైపుణ్యాలు సాదించలేకపోయాడని, ఇంజనీరింగ్ విద్యార్థులలో కేవలం 10%మందికి మాత్రమే నైపుణ్యం కలవారని, మిగతా 90% మంది చిన్న ఉద్యోగాలు చూసుకుంటున్నారని కావున నూతన విద్యా విధానం ముఖ్యంగా ఈ అంశాల మీద దృష్టి కేంద్రీకరించి విద్యార్థి కేంద్రంగా విడుదలైందని దీన్ని అందరూ ఆహ్వానించాలని తెలిపారు.

కొఠారి కమిషన్ సూచించన 10+2+3 విద్యావిధానంలో స్థానంలో తీసుకురాబడుతున్న 5+3+3+4 విద్యావిధానంలో కేవలం పెడాగాగి, కరిక్యులమ్, సిలబస్ నిర్మాణాన్ని మాత్రమే మార్చారని, విద్యా వ్యవస్థ ల ఫిజికల్ స్ట్రక్చర్ మాత్రం అలానే ఉందని, దీని మీద లేనిపోని అపోహలు కలిగించవద్దని తెలియజేశారు. 

● నూతన విద్యా విధానం – ఇంటర్మీడియట్ పరిస్థితి

నూతన విద్యా విధానం వలన ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థకు వచ్చిన నష్టం ఏమి లేదని, NPE ఇంటర్మీడియట్ వ్యవస్థను మరింత బలోపేతం చేయమని చెప్పిందని తెలిపారు.  ఇంటర్మీడియట్ వ్యవస్థ స్కూల్ ఎడ్యుకేషన్ లో విలీనం అవుతుంది అనేది వట్టి అపోహ అని,  ఫిజికల్ స్ట్రక్చర్ ఎప్పటికీ పాత విధానంలోనే ఉంటుందని తెలిపారు.

 5+3+3+4 విధానానికి అర్థం మొదటి ఐదు సంవత్సరాలు విద్యార్థి ఏమి నేర్చుకోవాలి, తర్వాత మూడు సంవత్సరాలు ఎలాంటి నైపుణ్యాలు నేర్చుకోవాలి, మిగతా మూడు సంవత్సరాలు అతని శక్తి సామర్ధ్యాలు ఏమిటని, చివరి నాలుగు సంవత్సరాలలో ఆ విద్యార్థి యొక్క భవిష్యత్తు ఏ రంగంలో రాణిస్తాడో ఆ రంగాన్ని ఎంచుకునే అవకాశం కల్పించాలని మాత్రమే అర్థం అని తెలిపారు.

● ఇంటర్ లో 120 కి పైగా కోర్సులు ఎర్పడే అవకాశం.

నూతన విద్యా విధానం లో విద్యార్థి తొమ్మిదో తరగతిలోనే ఏ రంగాన్ని ఎంచుకోవాలో నిర్ణయించుకుంటాడని దానివలన విద్యార్థికి చాలా మేలు జరుగుతుందని తెలిపారు.ప్రస్తుతం ఇంటర్ విద్యా వ్యవస్థలో ఉన్న ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ కోర్సులు మాత్రమే ఉన్నాయని, కానీ నూతన విద్యా విధానంలో విద్యార్థి తనకు ఇష్టమైన సబ్జెక్టులను ఒక కోర్స్ గా ఎంచుకునే అవకాశం ఉంటుందని తద్వారా నూతన 120 కి పైగా గ్రూపులు ఇంటర్మీడియట్ లో ఎర్పడే అవకాశం ఉందని,  భవిష్యత్తులో ఇంటర్మీడియట్ వ్యవస్థ మరింత అభివృద్ధి చెందుతుందని తెలియజేయడం జరిగింది.

● ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణ న్యాయ స్థానాల పరిధిలో ఉంది.

రాష్ట్రంలో పని చేస్తున్న కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల క్రమబద్ధీకరణ నిర్ణయం న్యాయ స్థానాల పరిధిలో ఉందని, అది ఇప్పట్లో తేలేది కాదని, క్రమబద్ధీకరణ అనేది ముగిసిన అధ్యాయం అని తెలిపారు. ఉమాదేవి కేసులో సుప్రీం కోర్ట్  సరైన మార్గదర్శకాలు లేకుండా నియమించబడిన తాత్కాలిక ఉద్యోగిని క్రమబద్ధీకరించవద్దని తీర్పు చెప్పింది. కావునా క్రమబద్ధీకరణకు బదులు వారికి జీతాలు ఇతర సౌకర్యాలు కల్పించడం ద్వారా ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు. 

● అతిథి అధ్యాపకులను రెన్యూవల్ చేయాలి.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో దాదాపు 1500 మంది అతిథి అధ్యాపకులు ఇప్పటికీ రెన్యూవల్ కి నోచుకోలేదని, అయినప్పటికీ వారు జీతాలు రావని తెలిసి కూడా ప్రభుత్వ కళాశాలలో నేటికీ పనిచేస్తున్నారని ప్రభుత్వం వారి విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

Follow Us @