మాతృభాష _ హృదయ ఘోష

  • అంతర్జాతీయ భాష దినోత్సవం సందర్భంగా అడ్డగూడి ఉమాదేవి ప్రత్యేక వ్యాసం

BIKKI NEWS : తల్లి ముఖతా ఉగ్గుపాలతో అప్రయత్నంగా నేర్చుకునేది మాతృభాష .మనిషి అప్రయత్నంగా,ఏ కష్టం లేకుండా జీవితంలో నేర్చుకునే మొదటి భాష మాతృ భాష.
“పరభాషద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌధం” లాంటిదన్న విశ్వకవి రవీంద్రుని మాటలు అక్షర సత్యాలు.
మాతృభాష జ్ఞానార్జనకు, భావ వ్యక్తీకరణకు ,విషయ గ్రహణకు,రసానుభూతికి, తోడ్పడుతుంది కాబట్టే
“తల్లి నొడికంటె పరమామృతంబు గలదే “అని రాయప్రోలుగారన్నారు.

భారత రాజ్యాంగములోని 345వ అధికరణం తమ తమ ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి రాష్ట్రాలకు అధికారమివ్వగా ఆంధ్రప్రదేశ్ విభాగం 1966లో అధికార భాషా శాసనాన్ని తయారుచేసింది.దీని ప్రకారం తెలుగు అధికార భాషా స్థానాన్ని పొందింది.పరిపాలనా వ్యవహారాలన్ని తెలుగు భాషలో జరగాలని 1974 లో “అధికారభాషా సంఘం” ఏర్పడింది. రాష్ట్ర రాజకీయ పరిపాలన, న్యాయసంస్థలలో వ్యవహరించే భాషను పూర్వం “రాజభాష” అనగా ఇప్పుడు అధికార భాష అంటున్నారు.

తూర్పు పాకిస్తానీయులైన బంగ్లాదేశీయులు చేసిన భాషా ఉద్యమానికి నివాళిగా ప్రతీ యేట అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.

ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక లక్షణాలున్న భాషలు సుమారు 6000 కాగా మనదేశంలో 1652 మాతృభాషలున్నాయి. గత 300 సంవత్సరాల్లో ఒక్క అమెరికా ఆస్ట్రేలియాలలోనే అనేక మాతృభాషలు అంతమైపోయాయి . ఈ ప్రమాదాన్ని నివారించే ప్రయత్నంలో భాగంగానే యునెస్కో “మాతృ భాషల పరిరక్షణ ప్రజల జాతీయ,పౌర, రాజకీయ, సాంఘీక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులలో అంతర్భాగం అని నిర్ధారించింది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 21వ తేది నాడు జరుపుకోవాలని యునెస్కో 1999 నవంబరు 17 నాడు 30 వ సాధారణ మహాసభలోప్రకటించింది

ప్రపంచంలోని భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడానికీ, బహుభాషా విధానాన్ని ప్రోత్సహించడానికీ, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి ఇది సరైన మార్గం అని యునెస్కో తెలిపింది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఏటా ఒక థీమ్ ను కూడా యునెస్కో ప్రకటిస్తోంది.

భారత రాజ్యాంగం గుర్తించిన నాలుగు ముఖ్యమైన ద్రావిడ భాషలలో తెలుగు కూడా ఒకటి. ద్రావిడ భాషలను మాట్లాడేవారిలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య అధికం. భారత దేశంలో హిందీ ప్రథమ స్థానం వహించగా తెలుగు ద్వితీయ స్థానంలో ఉంది. 2000సంవత్సరాల క్రితమే తెలుగు ఒక స్వతంత్ర భాషగా స్థిరపడిపోయింది.
భారతీయ భాషలలో తెలుగుకు ఒక ప్రత్యేకత గలదు. ఆంగ్ల పండితులు తెలుగు భాషను – Italian of the East ” అని అభివర్ణిస్తుంటే పాలకులు ఆంగ్లమాధ్యమానికే పెద్దపీట వేసి మాతృభాష మనుగడకు తిలోదకాలిస్తున్నారు.

భారతదేశంలో అనేక రాష్ట్రాలు భాషాప్రయుక్త రాష్ట్రాలే. అన్ని రాష్ట్రాలలో అక్కడి ప్రాంతీయభాషను ప్రథమ భాషగా బోధిస్తారు. అంటే అక్కడి ప్రజల మాతృభాషే ప్రథమభాష. పాఠశాల విద్యలో విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాలని 1956లో కేంద్ర విద్యా విషయక సలహా సంఘం(CABE) త్రిభాషాసూత్రాన్ని రూపొందించింది. దాని ప్రకారం అన్ని రాష్ట్రాలలోని పాఠశాలలలో మూడు భాషలు బోధించాల్సి ఉంటుంది. 1) మాతృభాష లేదా ప్రాంతీయభాష 2) జాతీయభాష హిందీ 3) అంతర్జాతీయభాష ఆంగ్లం.

ప్రజాస్వామ్యంలో ప్రజల భాషలో పరిపాలన జరగడం ఉచితం. పాలనా వ్యవస్థకు సంబంధించిన అన్ని విషయాలు ప్రజలకు తెలియాలంటే ప్రజల భాష అవసరం. అధికార భాషగా తెలుగు అమలుకు తెలుగు అకాడమి 1969లో తెలుగు రాని ఉద్యోగులకు ఉచిత తరగతులు నిర్వహించడం. 1963లో పారిభాషిక పదకోశం తయారీ, 1980లో 27,600 పదాలతో పరిపాలనా న్యాయపదకోశం తయారీ వంటి విశిష్టమైన పాత్ర పోషించి మాతృ భాషాభివృద్ధికి తోడ్పడింది.

మాతృభాషాధ్యయనం సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికీ, సృజనాత్మకతకు,దేశభక్తి, జాతీయ భావాన్ని పెంపొందించడానికీ,సంస్కృతీ సంప్రదాయాలను గ్రహించడానికి తోడ్పడుతుంది. మాతృభాషలో బోధన జీవనోపాధినిస్తుంది అన్న విషయాలను మరచి పరభాషల మోజులో పడి ప్రాధమిక దశ నుండి ఆంగ్లమాధ్యమంలోనే బోధనాభ్యసనకు మొగ్గుచూపుతున్న నేటి తరం ఉగ్గుపాల భాషకు అన్యాయం చేస్తున్నారు. సాహిత్య వారసత్వసంపదకు జాతి మనుగడకు మాతృభాష ఎంతో దోహదం చేస్తుంది . సుసంపన్నమైన మన భాషాసౌందర్యాన్ని అవగాహన చేసుకోవడం , భావితరాలవారికందించడం భాషను కాపాడడం మన అందరి బాధ్యతే కానీ భారం కాదు అని మరువనంతవరకు మాతృభాష బతికే ఉంటుంది.

మాతృభాష గుండె ఘోష


పురిటి పొత్తిలిలోన
పులకాంకురముల దేలి
తల్లి ముఖత నేర్చు
అతులితమైన భాష
మాతృభాష

ఉగ్గుపాలుదాగి ఊయలబొమ్మతో
ఊసులాడు భాష
మాతృభాష

గాఢనిద్రలోన
మూసిన కనులకు ముచ్చటగొలుపు కలవరింతల భాష మాతృభాష

ఒంటరైన వేళ జంటతానై
మనసు పొరలు మీటు
ప్రేమ సంకేతాల పెదవి పలికే భాష
మాతృభాష

చితికిన బతుకకు చిలుకపలుకై
మెతుకు వెట్టు
భవిత జూపు భాష
మాతృభాష

సంతలో వింతగ సంధించు అస్త్రమై
చిరు వ్యాపారుల జీవనఘోష
మాతృభాష

ఎల్లలు దాటినా ఎడబాటునెరుగక
అంతరంగమైన అమ్మభాష నా
మాతృభాష

పరభాష ఊతమై ప్రాకులాడువేళ
ఊపిరై నిలబెట్టు
మాతృభాష
నా గుండె ఘోష

అడ్డగూడి ఉమాదేవి
తెలుగు అధ్యాపకురాలు
9908057980

అడ్డగూడి ఉమాదేవి
తెలుగు అధ్యాపకురాలు
9908057980