సెకండీయర్ లో ఇలా పాస్ చేయం :: సబితా ఇంద్రారెడ్డి

ఇంటర్‌ ఫస్టియర్‌ పలితాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిలైన ఫస్టియర్ విద్యార్థులను కనీస మార్కులతో పాస్‌ చేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంటర్‌ విద్యార్థుల ఆందోళనలపై మంత్రి స్పందించారు. ‘‘కరోనా సమయంలో విద్యావ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంది. కరోనా వేళ తరగతుల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టాం. దూరదర్శన్‌ ద్వారా విద్యార్థులకు పాఠాలు అందించాం. వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి సమన్వయం సాధించాం. 9, 10 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రమోట్‌ చేశాం. విద్యార్థి జీవితంలో ఇంటర్‌ విద్య చాలా కీలకం. 620 గురుకులలాను, 172 కస్తూర్బా కళాశాలలకు ఇంటర్‌కు అప్‌గ్రేడ్‌ చేశాం. ఇంటర్‌ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. టీ-శాట్‌, దూరదర్శన్‌ వెబ్‌సైట్‌ల ద్వారా పాఠాలు అందుబాటులో ఉంచాం. నెలరోజుల సమయమిచ్చి పరీక్షలు నిర్వహించాం. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. 4.50లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్‌ ఫస్టియర్‌లో 49శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్‌ ఫలితాలపై వచ్చిన విమర్శలు సరికాదు. 10వేల మంది విద్యార్థులు 95శాతం మార్కులు సాధించారు. ఇంటర్‌ బోర్డు తప్పు లేకున్నా నిందిస్తున్నారు. ఇంటర్‌ బోర్డు వద్ద ఆందోళనలు బాధాకరం. పార్టీలను పక్కనపెట్టి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ప్రతిదీ రాజకీయ కోణంలో చూడొద్దు. విద్యార్థుల తల్లిదండ్రులు, విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలి.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, సీఎం కేసీఆర్‌ ఆదేశాలమేరకు .. ఇంటర్‌ విద్యార్థులందరికీ మినిమం 35 మార్కులు ఇచ్చి అందిరినీ పాస్‌ చేస్తున్నాం. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో మంచి మార్కులు సాధించాలి. ఇలాగే ఆందోళనలు చేస్తే ఇంటర్‌ సెకండియర్‌లో కూడా పాస్‌ చేస్తారని ఆశించవద్దు’’ అని మంత్రి సబితా ఇద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.