BIKKI NEWS (DEC. 20) : ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భారత్ వాటా 16 శాతానికి మించి ఉందని ఐఎంఎఫ్ కు ప్రతినిధి ఒకరు (india has 16% share in world economic growth says IMF) తెలిపారు. డిజిటలీకరణ, మౌలిక వసతుల లాంటి ప్రధాన రంగాల్లో ఆర్థిక సంస్కరణల అండతో ఆకర్షణీయ వృద్ధి రేటును నమోదు చేస్తూ, అద్భుత పనితీరు కనబర్చిన దేశంగా భారత్ నిలిచిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) తెలిపింది. ఈ ఏడాది ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన దేశాల్లో ఒకటిగా భారత్ నిలవనుందని ఐఎంఎఫ్ తెలిపింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం సహా అంతర్జాతీయంగా పలు రకాల సవాళ్లను భారత్ ఎదుర్కొంటున్నా, రాణిస్తోందని తెలిపారు. మౌలిక వసతులకు ప్రభుత్వం భారీగా కేటాయింపులు చేస్తుండటం, లాజిస్టిక్ ల అభివృద్ధి లాంటివి ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నాయని అన్నారు.
యువ జనాభా ఎక్కువ సంఖ్యలో ఉండటమూ భారత్ కు మరో సానుకూలాంశమని పేర్కొన్నారు. 2023 ప్రారంభంలోని అంతర్జాతీయంగా ఆర్థిక సేవల సంక్షోభ ప్రభావం భారత ఆర్థిక సేవల రంగంపై పెద్దగా కనిపించలేదు. ద్రవ్యలోటు తగ్గడంతో పాటు ప్రభుత్వ రుణాలు అధిక స్థాయిల్లోనే కొనసాగుతున్నాయి. ద్రవ్య నిల్వలను తిరిగి పెంచుకోవాల్సిన అవసరం ఉంది. బహుళజాతీయ విధాన ప్రాధాన్యాల్లో భారత్ పాత్ర ఎంతో కీలకమనే విషయం.. జీ20కు భారత్ సారథ్యం వహించడం ద్వారా నిరూపితమయ్యిందని ఐఎంఎఫ్ వివరించింది.