పాలిటెక్నిక్ ర్యాంక్ ఆధారంగా ట్రిపుల్ ఐటీలో సీట్లు.!

బాసరలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వ విద్యాలయం (RGKUT)లో సీట్లను ఈసారి పాలిసెట్‌ ఆధారంగానే భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏటా పదో తరగతిలో గ్రేడ్ల ఆధారంగా ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ (ఇంటర్‌ రెండు సంవత్సరాలు, బీటెక్‌ నాలుగేళ్లు) సీట్లను భర్తీ చేస్తున్నారు. పాలీసెట్ – 2021 దరఖాస్తు గడువు జూన్ 11వ తేదీతో ముగుస్తుంది.

పాలీసెట్ – 2021 నోటిఫికేషన్

బాసరలో మొత్తం 1,500 సీట్లు ఉన్నాయి. 2019 వరకు 10 జీపీఏ విద్యార్థుల సంఖ్య తొమ్మిది వేలు దాటలేదు. గత ఏడాది (2020) అంతర్గత పరీక్షల ఆధారంగా పదో తరగతిలో గ్రేడ్లు ఇవ్వడంతో 10 జీపీఏ వారి సంఖ్య 1.41 లక్షలు దాటింది.

ఫైనల్‌ పరీక్షలు లేనందున ఈ విధానంలో భర్తీ చేస్తే నిజమైన ప్రతిభావంతులకు సీట్లు దక్కవన్న అభిప్రాయం విద్యావేత్తల్లో వ్యక్తమవుతోంది. అందుకే ఈసారి ప్రవేశ పరీక్ష జరపాలన్న చర్చ జరుగుతోంది. ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షకు బదులు ఇప్పటికే పాలిటెక్నిక్‌ డిప్లొమా సీట్ల భర్తీకి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రతి ఏటా పాలిసెట్‌ను నిర్వహిస్తున్నందున దాని ఆధారంగా ఆర్‌జీయూకేటీ సీట్లను భర్తీ చేయవచ్చన్న ప్రతిపాదనపై వర్సిటీ అధికారులు చర్చించినట్లు తెలిసింది. దీనిపై విద్యాశాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Follow Us@