గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి హైకోర్ట్ కీలక ప్రశ్నలు

హైదరాబాద్ (జూన్ – 22) : జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో క్రమాలను నిరోధించడంలో కీలకమైన అంశాలను ఎందుకు విస్మరించారని హైకోర్టు ఈ రోజు విచారణ సందర్భంగా టీఎస్పీఎస్సీని ప్రశ్నించింది.

గ్రూప్​ 1 ప్రిలిమ్స్​ ఎగ్జామ్ కు హాజరైన అభ్యర్థుల నుంచి ముందే చెప్పిన విధంగా బయోమెట్రిక్‌ ను తీసుకోలేదని, అభ్యర్థులకు ఇచ్చిన ఓఎంఆర్‌ షీట్‌లో హాల్‌టికెట్ నంబర్ లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 ను రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దారులు న్యాయ స్థానాన్ని కోరారు.

ఈ రోజు విచారణ చేపట్టిన హైకోర్టు ఓఎంఆర్ షీట్ పై ఫోటో లేకపోవడాన్ని, ఓఎంఆర్ షీట్ పై అభ్యర్థుల హాల్‌టికెట్ నంబరు, ఫోటో ఎందుకు లేవని, బయోమెట్రిక్ ఎందుకు సేకరించలేదని టీఎస్పీఎస్సీని హైకోర్ట్ ప్రశ్నించింది. అక్టోబరులో పరీక్ష నిర్వహించిన పాటించిన నిబంధనలను జూన్ లో నిర్వహించిన పరీక్ష సమయంలో ఎందుకు పాటించలేదని వాఖ్యానించింది. ఎగ్జామ్ నిర్వహణలో అక్రమాలను నిరోధించడంలో కీలకమైన అంశాలను ఎందుకు విస్మరించారని హైకోర్టు ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీని ప్రశ్నించింది.

పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేయాలన్నది టీఎస్పీఎస్సీ విచక్షణ అధికారమని టీఎస్​పీఎస్సీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. బయోమెట్రిక్, ఓఎంఆర్‌పై ఫోటోకు సుమారు రూ.1.50 కోట్ల ఖర్చు అవుతుందని టీఎస్​పీఎస్​సీ న్యాయస్థానానికి తెలిపింది. ఆధార్ వంటి గుర్తింపు కార్డుల ద్వారా ఇన్విజిలేటర్లు అభ్యర్థులను ధ్రువీకరించారని హైకోర్టుకు విన్నవించారు. పరీక్ష పారదర్శకంగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేయడం టీఎస్పీఎస్సీ బాధ్యత అని.. పరీక్షల నిర్వహణలో ఖర్చుల విషయం ముఖ్యం కాదని హైకోర్టు వాఖ్యానించింది. ఈ వ్యవహారంలో మూడు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని టీఎస్పీఎస్సీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.