ఉమాదేవి కేసు దొడ్డిదారి నియామాకాలకే వర్తిస్తుంది – హైకోర్టు

  • వెట్టిచాకిరి చేయించుకుని వదిలేస్తారా
  • ఉమాదేవి కేసు దొడ్డి దారి నియామాకాలకే
  • సర్వీస్ రెగ్యులర్ కావద్దని ఉద్దేశ్యంతోనే రెండు నెలల సెలవులు
  • 12 నెలలు వేతనం ఇవ్వాలి
  • విధుల నుండి తొలగించకూడదు

గురుకుల కళాశాలల్లో రెగ్యులర్‌ పోస్టులు భర్తీ చేయకుండా ఏళ్ల తరబడి కాంట్రాక్టు/ ఔట్‌సోర్సింగ్‌ జూనియర్‌ లెక్చరర్లతో పని చేయించుకొని, ప్రభుత్వం వారి శ్రమను దోచుకుంటోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. వారి సర్వీసులు క్రమబద్ధీకరించకుండా ఉండడానికే ప్రతి సంవత్సరం వేసవిలో రెండు నెలలు విధుల నుంచి తొలగించి తిరిగి జూన్‌లో నియమించుకోవడాన్ని తప్పుపట్టింది.

18-20 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసిన వీరికి మరో ఉద్యోగానికి దరఖాస్తు వయో పరిమితీ లేకుండా పోతుంది కదా? అని ప్రశ్నించింది. 2003 నుంచి ఇదే విధానాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వం రెగ్యులర్‌ పోస్టుల భర్తీలో వారికి ఇస్తున్న వెయిటేజీ ఏమిటని నిలదీసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.

ప్రజల సంక్షేమాన్ని చూడాల్సిన ప్రభుత్వమే వారితో చాకిరీ చేయించుకుని వదిలేయడం సరికాదని పేర్కొంది. వేసవిలో వారితో పని చేయించుకోవద్దని ఎవరు చెప్పారని నిలదీసింది.

ప్రభుత్వ గురుకులాల్లో కాంట్రాక్టు లెక్చరర్లు/ పీఈటీలుగా విధులు నిర్వహిస్తున్న పి.వెంకటరమణ మరో 115 మంది వేసవిలో రెండు నెలలు విధుల నుంచి తొలగించడాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన సింగిల్‌ జడ్జి పిటిషనర్లకు 12 నెలల వేతనాలు చెల్లించాలని, విధుల నుంచి తొలగించరాదని ఆదేశాలు జారీచేశారు.

పిటిషనర్లకు 12 నెలల వేతనాలు చెల్లించాలని, విధుల నుంచి తొలగించరాదని ఆదేశాలు జారీచేశారు.

వీటిపై ప్రభుత్వం అప్పీలు దాఖలు చేసింది. ఈ అప్పీలు విచారణ సందర్భంగా విద్యాశాఖ తరఫు న్యాయవాది పిటిషనర్లు బహుళ వ్యాజ్యాలు వేశారని తెలిపారు. ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు దొడ్డిదారిలో చేరినవారి సర్వీసులు క్రమబద్ధీకరించడానికి వీల్లేదని చెప్పిందని గుర్తుచేశారు. విద్యా సంవత్సరం ప్రారంభంతో తిరిగి తీసుకుంటున్నారని తెలిపారు. స్పందించిన ధర్మాసనం.. అది మీరు సృష్టించిందేనని, కనీస వేతనాలు చెల్లించాలని కోరితే ఉద్యోగాల నుంచి తొలగించడం మొదలు పెట్టారని ఆక్షేపించింది. అందుకే మరో వ్యాజ్యం వేయాల్సి వచ్చిందని వ్యాఖ్యానించింది. ఉమాదేవి కేసులో తీర్పు దీనికి వర్తించదని తెలిపింది.

ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు దొడ్డిదారిలో చేరినవారి సర్వీసులు క్రమబద్ధీకరించడానికి వీల్లేదని చెప్పిందని హైకోర్టు వారు గుర్తుచేశారు.

ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన, వారికున్న విద్యార్హతలను బట్టి ఎంపిక చేసినందున ఇవి దొడ్డిదారి నియామకాలు కావని స్పష్టం చేసింది. ప్రభుత్వం కావాలనే విధుల నుంచి తొలగించి సర్వీసును దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించింది. మీ అప్పీలు కొట్టివేస్తామని హెచ్చరించింది.

ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరణ ఇస్తూ.. పిటిషనర్లు 2003 నుంచి పనిచేస్తున్నందున్న రెగ్యులర్‌ నియామకాల్లో రాయితీలు కల్పించాలంటూ ప్రభుత్వానికి సూచనలు చేస్తామని, కేసు విచారణను వాయిదా వేయాలని కోరారు. సింగిల్‌ జడ్జి ఆదేశాలపై పిటిషనర్లు కోర్టు ధిక్కార వ్యాజ్యం వేశారని, దానిపై ఒత్తిడి చేయకుండా చూడాలని అభ్యర్థించారు. కోర్టు ధిక్కార కేసులో ఒత్తిడి చేయవద్దని పిటిషనర్లకు సూచించిన ధర్మాసనం.. విచారణను ఆగస్టు 11కి వాయిదా వేసింది.

CREDITS :: ANDHRA JYOTHI