కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పేరుతో శ్రమ దోపిడీకి అంతం లేదా.? – హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి హిమకోహ్లీ

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో లెక్చరర్‌ పోస్టులను ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు పద్దతిలోనే ఏండ్ల తరబడి కొనసాగిస్తూ వారి క్రమబద్ధీకరణ కు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పచ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

ఈ శ్రమ దోపిడీ విధానం ఇక్కడే ఉన్నదా లేక ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే స్థాయిలో అమలు అవుతోందా అని సందేహాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో లెక్చరర్ల నియామక నిబంధనలను నివేదించాలని ఆర్థిక, పాఠశాల, సాంకేతిక విద్యాశాఖల ముఖ్య కార్యదర్శులు, జేఎన్‌టీయూ, ఉస్మానియా వర్శిటీ రిజిస్ట్రార్లను, ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) కార్యదర్శులను ఆదేశించింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ ఆదేశాలు జారీ చేసింది. పలు ప్రభుత్వ కాలేజీల్లో, ఇంజినీరింగ్‌ కాలేజీల్లోనే కాకుండా ప్రయివేటు కాలేజీల్లో కూడా లెక్చరర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని ఔట్‌సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేస్తున్నారని లాయర్‌ కె.శ్రవణ్‌కుమార్‌ రాసిన లేఖను హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించి విచారణ చేపట్టింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు పొందుతున్న పలు ప్రయివేటు కాలేజీల్లో ఔట్‌సోర్సింగ్‌లోనే లెక్చరర్లు పనిచేస్తున్నారనీ, పలు ప్రభుత్వ కాలేజీల్లోనూ, టీచింగ్‌ కాలేజీల్లోనూ కూడా ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ విధానంలోనే లెక్చరర్లు ఏండ్ల తరబడి పనిచేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. విచారణ సెప్టెంబర్ 29 కి వాయిదా వేశారు.

Follow Us @